Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ షాక్.. ఆ బిల్లు దుర్మార్గం అంటూ ఆగ్రహం

తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ, మస్క్ "అమెరికా అప్పుల ఊబిలోకి వేగంగా దూసుకుపోతోందని" హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 8:00 PM IST
ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ షాక్.. ఆ బిల్లు దుర్మార్గం అంటూ ఆగ్రహం
X

ట్రంప్ ప్రభుత్వం నుంచి హఠాత్తుగా బయటకు వచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను 'దుర్మార్గమైన, అసహ్యకరమైన' ప్రణాళికగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ భారీ ఖర్చుల బిల్లుపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడిన మస్క్, అమెరికా ప్రజలు పార్లమెంటు సభ్యులను కలిసి బిల్లును రద్దు చేయమని ఒత్తిడి చేయాలని కోరారు.

మస్క్ ఇంతకు ముందు ట్రంప్ ప్రభుత్వంలో 'ప్రభుత్వ పనితీరు విభాగానికి (Department of Government Efficiency - DOGE)' అధిపతిగా పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఉన్న అనవసర ఖర్చులను తగ్గించడమే ఆయన లక్ష్యం. అయితే, గత వారం ప్రభుత్వం నుంచి వైదొలిగిన తర్వాత, గతంలో తను మద్దతు ఇచ్చిన పరిపాలనపైనే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.

తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ, మస్క్ "అమెరికా అప్పుల ఊబిలోకి వేగంగా దూసుకుపోతోందని" హెచ్చరించారు. ఈ చట్టంలో పూర్తిస్థాయి మార్పులు చేయాలని ఆయన పట్టుబట్టారు. "అప్పులను భారీగా పెంచని, రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లు పెంచని కొత్త ఖర్చుల బిల్లును రూపొందించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు సంబంధించి తమ సెనేటర్లు, పార్లమెంటు సభ్యులకు ఫోన్ చేయాలని కూడా ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదిక అయిన 'ఎక్స్' (X) లో.. "మీ సెనేటర్‌కు కాల్ చేయండి, మీ పార్లమెంటు సభ్యుడికి కాల్ చేయండి. అమెరికాను దివాళా తీయించడం సరికాదు. బిల్లును రద్దు చేయండి." అంటూ రాసుకొచ్చారు.

ఎలాన్ మస్క్ అమెరికా అప్పుల్లో కూరుకుపోతుందని హెచ్చరించారు. "ఈ ఖర్చుల బిల్లు అమెరికా చరిత్రలో రుణ పరిమితిని అత్యధికంగా పెంచుతుంది! ఇది 'రుణ బానిసత్వ బిల్లు'" అని 'ఎక్స్' లో మరో పోస్ట్‌లో మస్క్ పేర్కొన్నారు. మస్క్ ఈ బిల్లు అమెరికా ప్రజల ప్రయోజనాలకు హానికరం అని మస్క్ భావించారు. ఈ బిల్లులో భారీ పన్ను తగ్గింపులు, సైనిక వ్యయం పెంచడం వంటివి ఉన్నాయి. మస్క్ ఈ వ్యతిరేకత ప్రస్తుత పార్లమెంటు సభ్యులకు ప్రమాదకరంగా మారవచ్చని రిపబ్లికన్లు భయపడుతున్నారు.