Begin typing your search above and press return to search.

ట్రంప్ తో ఎలన్ మస్క్ తెగదెంపులు.. వైదొలిగాడు.. కారణమిదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఎలాన్ మస్క్ యూఎస్ ప్రభుత్వంలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE)లో తాను చేపట్టిన ప్రత్యేక విధుల నుంచి వైదొలిగారు.

By:  Tupaki Desk   |   29 May 2025 11:43 AM IST
ట్రంప్ తో ఎలన్ మస్క్ తెగదెంపులు.. వైదొలిగాడు.. కారణమిదే
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఎలాన్ మస్క్ యూఎస్ ప్రభుత్వంలోని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE)లో తాను చేపట్టిన ప్రత్యేక విధుల నుంచి వైదొలిగారు. అమెరికాతో తన ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ముగిసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

-'డోజ్'లో విధులకు దూరం

బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాను 'ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి'గా తన షెడ్యూల్ సమయం ముగిసిందని ప్రకటించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. "డోజ్ మిషన్ కాలక్రమేణా బలపడుతుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వం అంతటా ఒక జీవన విధానంగా మారుతుంది" అని ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

-వైట్ హౌజ్ ధ్రువీకరణ

ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలాన్ మస్క్ వైదొలగుతున్నట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు ధృవీకరించారు. మస్క్ యూఎస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలగడం వాస్తవమేనని, అతని 'ఆఫ్ బోర్డింగ్' పదవీ విరమణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ అధికారి తెలిపారు. ట్రంప్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీలో (DOGE) ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ 130 రోజుల పదవీ కాలం మే 30తో ముగిసింది. ఫెడరల్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి డోజ్ ప్రయత్నాలు కొనసాగుతాయని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.

-ట్రంప్ పన్ను బిల్లుపై ఎలాన్ మస్క్ అభిప్రాయం

డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒక బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ట్రంప్, మస్క్‌ల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘బిగ్, బ్యూటీఫుల్ బిల్’ను మస్క్ ఇటీవల తీవ్రంగా విమర్శించారు. ఆ బిల్లులో కొత్తగా పన్ను విధింపులు, మెరుగైన ఇమ్మిగ్రేషన్ అమలు మొదలైనవి ఉంటాయి. సిబిఎస్‌తో మాట్లాడుతూ మస్క్ దీనిని "భారీ వ్యయ బిల్లు"గా అభివర్ణించారు. ‘‘ఇది ఫెడరల్ లోటును పెంచుతుంది. డీఓజీఈ అని పిలువబడే నా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ పనిని బలహీనపరుస్తుంది’’ అని ఆయన అన్నారు.

మస్క్ సీబీఎస్ ఇంటర్వ్యూ మంగళవారం రాత్రి బయటకు వచ్చింది. బుధవారం ఓవల్ కార్యాలయంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ చట్టంపై సంప్రదింపులు జరపడంలో ఉన్న సున్నితమైన రాజకీయాల గురించి మాట్లాడటం ద్వారా తన ఎజెండాను సమర్థించుకున్నారు. అందులోని కొన్ని అంశాల పట్ల తాను సంతోషంగా లేనని, కానీ ఇతర అంశాలతో తాను థ్రిల్‌కు గురయ్యానని చెప్పారు. మరిన్ని మార్పులు చేయవచ్చని ట్రంప్ సూచించారు. రిపబ్లికన్లు ఇటీవల ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి సెనేట్‌లో చర్చిస్తున్నారు.