'భూమి అంతం కాబోతుంది'.. సెకండ్ ఆప్షన్ పై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచానికి ఎలాన్ మస్క్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని.. ఇక్కడ ఎక్కువకాలం మానవాళి జీవనం సాగించలేదని ఎలాన్ మస్క్ తెలిపారు.
By: Tupaki Desk | 7 Jun 2025 7:00 PM ISTసాధారణంగా భూమిపై భారీ ప్రళయం సంభవించబోతోందని.. గ్రహశకలాలు ఢీకొట్టడంతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకం కాబోతుందని.. త్వరలో భూమి అంతం కాబోతుందని రకరకాల ప్రిడిక్షన్స్ ప్రతీ ఇయర్ ఎండ్ సమయంలో వినిపించే సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. భూమి అంతం గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అవును... ప్రపంచానికి ఎలాన్ మస్క్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని.. ఇక్కడ ఎక్కువకాలం మానవాళి జీవనం సాగించలేదని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సందర్భంగా... మనిషి మనుగడ సాగించడానికి అంగారక గ్రహమే సురక్షితమైన ప్రదేశమని తెలిపారు.
తాజాగా స్పేస్ ఎక్స్ అంతర్గత చర్చల్లో మాట్లాడిన ఎలాన్ మస్క్.. ఈ విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా భూమి భవిష్యత్తు సురక్షితంగా లేదని.. మూడో ప్రపంచ యుద్ధం వంటి అస్థిత్వ ముప్పు సంభవించినప్పుడు మానవాళికి సురక్షితమైన గ్రహంగా అంగారకగ్రహం ఉండాలని అన్నారు.
ఈ నేపథ్యంలో 2026 చివరి నాటికి స్టార్ షిప్ రాకెట్ అంగారక గ్రహానికి సిబ్బందిని పంపే అవకాశం 50శాతం ఉందని చెప్పిన ఎలాన్ మస్క్... ఈ సమయంలో డిసెంబర్ లో ఓ చిన్న గ్రహ విండోపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో అంగారక గ్రహం, భూమి ఒకదానికొకటి దగ్గరగా వస్తాయని అన్నారు.
అయితే.. ఆ సమయం మిస్ అయితే మాత్రం తదుపరి విండో 2028 వరకూ రాదని తెలిపారు. ఈ మేరకు వీడియో ప్రజెంటేషన్ లో ఈ విషయాలను మస్క్ స్పష్టంగా వివరించారు. మొదటి మిషన్ టెస్లా రూపొందించిన ఆప్టిమన్ హ్యూమనాయిడ్ రాబోట్ లను అంగారక గ్రహం ఉపరితలంపైకి తీసుకెళ్తుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
ఆ సమయంలో.. అవి సక్సెస్ ఫుల్ గా ఆ గ్రహంపై ల్యాండ్ అవుతాయనే అంచనాకు వచ్చిన తర్వాత మానవులను పంపుతామని అన్నారు. అనంతరం ఆ అంగారక గ్రహంపై మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తామని తెలిపారు.
వాస్తవానికి మరో 450 మిలియన్ సంవత్సరాల పాటు భూమి నివాసయోగ్యంగా ఉంటుందని అంచనావేసిన మస్క్... అణు యుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర మహమ్మారుల వల్ల సమీప భవిష్యత్తులోనే భూమి అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2030 నాటికి అంగారక గ్రహానికి స్పేస్ ఎక్స్ సుమారు 100 స్టార్ షిప్ లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు!
