ట్రంప్-మస్క్ సంబంధాల మధ్య భారత మార్కెట్లో కొత్త అనిశ్చితి!
టెస్లా భారత మార్కెట్‌లో అడుగుపెడితే దేశీయ ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) సంస్థలైన టాటా, మహీంద్రా వంటి కంపెనీలకు గట్టి పోటీగా మారుతుంది.
By: Tupaki Desk | 12 Jun 2025 4:00 AM ISTప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ కార్ప్, స్టార్‌లింక్ వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ భారతదేశంలో తన వ్యాపారాలను విస్తరించాలని గత కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మస్క్ షరతులతో కూడిన నిబంధనలతో మాత్రమే దేశంలోకి ప్రవేశించాలని పట్టుబడుతుండటంతో భారత ప్రభుత్వం – మస్క్ మధ్య చర్చలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తర్వాత, మస్క్‌కు ట్రంప్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా భారత్ ఈసారి మస్క్ వ్యాపారాలకు సానుకూలంగా స్పందించవచ్చని కొందరు అంచనా వేశారు. అయితే, ఇటీవలే మస్క్ – ట్రంప్ మధ్య తలెత్తిన విభేదాలు ఈ అంచనాలపై నీరుగార్చాయి.. ఈ తాజా పరిస్థితుల్లో మస్క్ వ్యాపారాలు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తాయా? ప్రవేశిస్తే, ఏ నిబంధనలపై అనేది కీలక ప్రశ్నగా మారింది.
- భారత మార్కెట్‌పై ప్రభావం:
టెస్లా భారత మార్కెట్‌లో అడుగుపెడితే దేశీయ ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) సంస్థలైన టాటా, మహీంద్రా వంటి కంపెనీలకు గట్టి పోటీగా మారుతుంది. ఇప్పటికే భారతీయ కంపెనీలు దేశీయ వినియోగదారులకు అనుగుణంగా అధునాతన EV మోడళ్లను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో టెస్లా దూసుకుపోతే వీటి మార్కెట్ వాటా భారీగా తగ్గే అవకాశముంది.
అదే విధంగా స్టార్‌లింక్ భారత్‌కు వస్తే, ఆ దేశ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్ కంపెనీల ఆధిపత్యానికి సవాల్ విసరనుంది. గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించగలుగుతున్న స్టార్‌లింక్‌తో ఈ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.
-భారత్ ముందున్న అవకాశాలు, సవాళ్లు:
ఈ నేపథ్యంలో భారత్ ముందున్నది అవకాశాలు, సవాళ్లతో కూడిన వ్యాపారమే.. మస్క్ వ్యాపారాలకు అనుమతిస్తే కొత్త ఉద్యోగాలు, అధునాతన సాంకేతికతలు దేశంలోకి వస్తాయి. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన దేశీయ కంపెనీల బలపడే అవకాశాలు తగ్గిపోతాయి.
-ట్రంప్, కుక్, మస్క్:
ఇంతలో ట్రంప్ మరొక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. భారతదేశంలో ప్లాంట్‌లు స్థాపించొద్దని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను హెచ్చరించినట్టు సమాచారం. కానీ కుక్ ఈ సూచనను పట్టించుకోకుండా భారత్‌లో తమ ప్రణాళికలు కొనసాగిస్తామని ప్రకటించారు. మస్క్ కూడా అదే దారిలో నడుస్తాడా? లేక ట్రంప్ సూచనలతో వెనక్కి తగ్గుతాడా? అనేది ఆసక్తికరమైన అంశం.
మొత్తానికి భారత్ – మస్క్ సంబంధం ఏ మలుపు తిరుగుతుందన్నది గమనించాల్సిన విషయం. ప్రపంచ స్థాయిలో టెక్, ఆటో రంగాల్లో భారత్ ఎదుగుదల – మస్క్ వ్యాపార ఆశయాల భవిష్యత్తు ఈ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.
