ట్రంప్ కు షాకిచ్చిన మస్క్.. కొత్త పార్టీ ప్రకటన
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది.
By: Tupaki Desk | 6 July 2025 11:24 AM ISTఅమెరికా టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార విజయాలతో ప్రభావితం చేసిన మస్క్, ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన "ది అమెరికా పార్టీ" పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.
- ప్రజాస్వామ్యం లేదు : మస్క్ వ్యాఖ్య
ఈ కీలక నిర్ణయం వెనుక తనకున్న నమ్మకాలను ఎలాన్ మస్క్ వివరించారు. అమెరికాలో ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడుతోందని, ప్రజల స్వేచ్ఛను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే కొత్త పార్టీని ప్రకటించినట్లు తెలిపారు. "ప్రజలు తమ గొంతును వినిపించగలిగే వేదిక అవసరం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ప్రజల అవసరాలకు స్పందించడంలో విఫలమవుతోంది" అని మస్క్ స్పష్టం చేశారు.
-'బిగ్ బ్యూటిఫుల్ బిల్లు' పాస్ తర్వాత పార్టీ ప్రకటన
ఇటీవలే ఎలాన్ మస్క్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. “బిగ్ బ్యూటిఫుల్ బిల్లు” చట్టంగా మారితేనే కొత్త పార్టీని ప్రకటిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ బిల్లు చట్టంగా మారిన వెంటనే ఆయన ‘ది అమెరికా పార్టీ’ స్థాపన వివరాలను వెల్లడించారు. ఈ విషయంలో ఆయన నిర్వహించిన ఓటింగ్ పోల్ కూడా వైరల్ అయింది. అందులో 80 శాతం మంది మస్క్ పార్టీకి మద్దతుగా ఓటు వేయడం గమనార్హం.
- ట్రంప్ కల నెరవేర్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది. జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ బిల్లు అధ్యక్షుడి సంతకం ద్వారా అధికారికంగా చట్టంగా మారింది. ఈ చట్టం కింద ట్రిలియన్ల డాలర్ల పన్ను మినహాయింపులు, $1.2 ట్రిలియన్ల మెడికేడ్, ఫుడ్ స్టాంప్స్ కోత, వలస సేవల విభాగానికి పెరిగిన నిధులు వంటివి ఉన్నాయి. అయితే కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయ అంచనాల ప్రకారం ఈ చట్టం వల్ల వచ్చే పదేళ్లలో $3.3 ట్రిలియన్ల ఫిస్కల్ లోటు తగ్గవచ్చు. కానీ అదే సమయంలో $1.2 కోట్ల మంది ఆరోగ్య బీమా నుంచి బయటపడే ప్రమాదం ఉందని అంచనా.
- భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం?
ఎలాన్ మస్క్ పార్టీ స్థాపనతో అమెరికా రాజకీయాల్లో భారీ మార్పులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇప్పుడే స్పందించడం చూస్తే, ఈ టెక్ దిగ్గజం నాయకత్వాన్ని రాజకీయంగా కూడా ఆదరిస్తారా అన్నది ఆసక్తికర అంశం. త్వరలో మస్క్ పార్టీ అభిప్రాయాలు, అభ్యర్థులు, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది చర్చనీయాంశమవుతుందని చెప్పాలి.
ముందు టెక్నాలజీ.. ఇప్పుడు రాజకీయాల దిశగా సాగుతున్న ఎలన్ మస్క్ రాజకీయ ప్రయాణం అమెరికాలో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
