అన్ని పనులు ఏఐ ద్వారానే.. 5-10 ఏళ్లలో ఉద్యోగాలు మాయం
కృత్రిమ మేధస్సు, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ శ్రమకు పెద్దగా పని ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
By: A.N.Kumar | 7 Sept 2026 9:16 PM ISTప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న తరుణంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు టెక్ వర్గాల్లో.. సామాన్యుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం మరో ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన బాంబు పేల్చారు. కృత్రిమ మేధస్సు, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో మానవ శ్రమకు పెద్దగా పని ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. చాట్‌జిపిటి వంటి ఏఐ టూల్స్ ఇప్పటికే సృష్టిస్తున్న ప్రకంపనల నేపథ్యంలో మస్క్ అంచనాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
రాబోయే ఐదేళ్లలో సాంకేతిక విప్లవం
మస్క్ అంచనాల ప్రకారం.. టెక్నాలజీ అనేది మానవ మేధస్సును చాలా వేగంగా అధిగమించబోతోంది. సుమారు ఐదేళ్లలోపు ఏఐ పూర్తిస్థాయిలో మానవ మేధస్సును మించిపోతుందని.. మరో పదేళ్లలో ప్రస్తుతం మనుషులు చేస్తున్న దాదాపు అన్ని పనులను ఏఐ, రోబోటిక్స్ కలయికతో సునాయాసంగా చేయగల స్థాయికి సాంకేతికత చేరుకుంటుందని ఆయన విశ్లేషించారు. దీని అర్థం మనుషులు పూర్తిగా నిరుద్యోగులు అవుతారని కాదు కానీ 'పని', 'ఉద్యోగం' అనే పదాలకు ఉన్న నిర్వచనం పూర్తిగా మారిపోనుంది.
ప్రభావం చూపే ప్రధాన రంగాలు ఇవే
అన్ని ఉద్యోగాలు రాత్రికి రాత్రే పోకపోయినా రొటీన్‌గా చేసే పనులపై ఏఐ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే కొన్ని రంగాల్లో ఏఐ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డెవలపర్లు గంటల తరబడి చేసే బేసిక్ కోడింగ్, డీబగ్గింగ్ పనులను ఏఐ టూల్స్ సెకన్లలో ఎలాంటి తప్పులు లేకుండా చేసేస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ చాట్‌బాట్లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు మనుషుల కంటే వేగంగా విసుగు లేకుండా కస్టమర్ల సమస్యలను తీరుస్తున్నాయి. ఆర్టికల్స్ రాయడం, లోగోలు డిజైన్ చేయడం నుంచి వీడియోలు ఎడిట్ చేయడం వరకు ఏఐ ఆటోమేషన్ పాత్ర బాగా పెరిగింది. ఎంత పెద్ద డేటానైనా క్షణాల్లో విశ్లేషించి, కచ్చితమైన అంచనాలు వేయడంలో ఏఐ ముందుంది. రొటీన్ అకౌంటింగ్, డాక్యుమెంటేషన్, బ్యాలెన్స్ షీట్ల నిర్వహణ కూడా ఆటోమేట్ అవుతోంది.
2036 నాటికి డబ్బే అవసరం లేదా?
మస్క్ చేసిన మరో ఆసక్తికరమైన కామెంట్ 'డబ్బు' గురించి. 2036 నాటికి ఏఐ, హ్యూమనాయిడ్ రోబోట్లు మనుషులకు అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులు, సేవలను భారీ స్థాయిలో అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటాయని ఆయన భావిస్తున్నారు. ఆ దశలో సమాజంలో ప్రతి ఒక్కరికీ అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి 'డబ్బు' ప్రాధాన్యత కూడా గణనీయంగా తగ్గిపోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేవలం బతుకుదెరువు కోసం.. డబ్బు కోసం పని చేయడం తప్పనిసరి కాకుండా ఒక వ్యక్తి తనకు ఇష్టమైతే.. అభిరుచి కోసం మాత్రమే పని చేసే పరిస్థితి వస్తుందని అంచనా వేశారు.
ఏఐతో పోరాడాలా? కలిసి నడవాలా?
ఈ భవిష్యత్ అంచనాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నా ఇందులో వాస్తవ పరిస్థితులను నియంత్రణలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది? ఆయా దేశాల ప్రభుత్వాలు ఉద్యోగులను రక్షించడానికి ఎలాంటి చట్టాలు, నియంత్రణలు విధిస్తాయి అనే దానిపైనే ఈ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ నాయకత్వ లక్షణాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సృజనాత్మకత, క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఏఐ నుంచి ముప్పు తక్కువే.
రాబోయే రోజుల్లో ఏఐని మన శత్రువుగా.. ఉద్యోగాలు లాగేసుకునే భూతంగా చూడకుండా మన పనిని మరింత వేగవంతం చేసే సహచరుడిగా.. సాధనంగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనముందున్న అసలు ప్రశ్న "ఉద్యోగాలు ఉంటాయా.. ఊడుతాయా?" అని కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా "ఏఐతో కలిసి పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?" అని... ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకునే వారికే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది.
