ఇజ్రాయెల్ ఎంబసీ కాల్పుల్లో ప్రధాన నిందితుడు.. ఎవరీ రోడ్రిగ్జ్?
వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 22 May 2025 6:25 PM ISTవాషింగ్టన్ డీసీలోని కాపిటల్ యూదు మ్యూజియం వెలుపల ఓ వ్యక్తి ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో "ఫ్రీ పాలస్థీనా" అంటూ అతడు నినాదాలు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఎవరీ ఎలియాస్ రోడ్రిగ్జ్ అనే విషయాలు తెరపైకి వచ్చాయి.
అవును... వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు. ఈ సమయంలో చికాగోకు చెందిన 30 ఏళ్ల వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఎలియాస్ రోడ్రిగ్జ్ అని గుర్తించగా.. అతడికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. రోడ్రిగ్జ్ కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని.. దాడికి ముందు వేదిక వెలుపల అటు ఇటు తిరుగుతూ కనిపించాడని తెలిపారు. ఆ సమయంలో బాధితులు మ్యూజియంలోకి కార్యక్రమం నుంచి బయటకు వెళ్తుండగా.. నలుగురితో కూడిన గుంపు వద్దకు వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఘటన అనంతరం అతడిని నిర్భంధంలోకి తీసుకోగా అప్పుడు అతడు "ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్థీనా" అని నినాదాలు చేశాడని వాషింగ్టన్ పోలీస్ చీఫ్ పమేలా స్మిత్ తెలిపారు! ఈ మరణాలను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.
ఎవరీ ఎలియాస్ రోడ్రిగ్జ్?
నివేదికల ప్రకారం ప్రధాన నిందితుడు 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్.. పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ (పీ.ఎస్.ఎల్) తో పాటు బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశాడు. 2017లో అప్పటి చికాగో మేయర్ రహమ్ ఇమ్మాన్యుయేల్ ఇంటి బయట జరిగిన నిరసనలోనూ పాల్గొన్నట్లు చెబుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని పీపుల్స్ కాంగ్రెస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఆన్స్వర్ చికాగో, బ్లాక్ లైవ్స్ మేటర్ ఉమన్ ఆఫ్ ఫెయిత్ వంటి గ్రూప్స్ నిర్వహించాయి. చికాగో పోలీసుల చేతిలో లాక్వాన్ మెక్ డొనాల్డ్ అనే యువకుడు హత్యకు గురైన వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. జాత్యహంకారం, ఆర్థిక అసమానతల గురించి ప్రధానంగా ఎత్తి చూపాడు!
కాగా.. లాక్వాన్ మెక్ డొనాల్డ్ అనే 17 ఏళ్ల నల్లజాతి యువకుడిని 2014 అక్టోబర్ 20న చికాగో పోలీస్ అధికారి జాసన్ వాన్ డైక్ 16 సార్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే! ఈ సంఘటన అమెరికాలోని పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన అత్యంత ప్రముఖ కేసుల్లో ఒకటిగా నిలిచింది. దీనికి సంబంధించిన నిరసనల్లో రోడ్రిగ్జ్ ప్రధానంగా పాల్గొన్నాడు!
