Begin typing your search above and press return to search.

కరెంటు బిల్లు కట్టమంటే కొట్టారు.. కట్ చేస్తే ఉల్టాగా కేసు పెట్టారట!?

కరెంటు బిల్లు కట్టమన్న సిబ్బంది మీద దాడి చేసిన ఉదంతం ఒక సంచలనమైతే.. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు మరింత షాకింగ్ గా మారాయి

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:19 AM GMT
కరెంటు బిల్లు కట్టమంటే కొట్టారు.. కట్ చేస్తే ఉల్టాగా కేసు పెట్టారట!?
X

కరెంటు బిల్లు కట్టమన్న సిబ్బంది మీద దాడి చేసిన ఉదంతం ఒక సంచలనమైతే.. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు మరింత షాకింగ్ గా మారాయి. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విధి నిర్వహణలో భాగంగా అక్కడి వారి చేత దెబ్బ తినటమే కాదు.. ఉల్టా కేసు పెట్టించుకోవటం ఏమిటంటూ విద్యుత్ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాటకీయ పరిణామాలకు నెలువుగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూళ్లు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజినేశ్ బాబు పై కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా సోదరుడు షరఫత్ తో పాటు ఒక లాయర్ మరో నలుగురు దాడి చేశారు. కూర్మగుడ కార్పొరేటర్ మహాపారా ఇంటికి దాదాపు ఒక సంవత్సరం విద్యుత్ బిల్లు బకాయి ఉంది. దీంతో విద్యుత్ బిల్ కలెక్టర్ రజినీష్ బాబు వారింటికి వెళ్లడం జరిగింది. దింతో కార్పొరేటర్ సోదరుడు షరఫత్ అలీ, ఓ అడ్వకేట్ మరో నలుగురు దాడి చేశారు. బిల్ కలెక్టర్ కు తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి మూత్రంలో రక్తం రావటంతో చలించిన విద్యుత్ సిబ్బంది మాదన్నపేట పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిందితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కట్టారు.

విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. పాతబస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయభ్రాంతులు అవుతున్నారంటూ వాపోయారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. సీన్ రాత్రికి రాత్రి మారిపోయింది. మంగళవారం అర్థరాత్రి యాకత్ పురా ఎమ్మెల్యే మిరాజ్ హుస్సేన్.. సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్.. తాలాబ్ చంచలం కార్పొరేటర్ సమీనా బేగంలు మాదన్నపేట పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు.

విద్యుత్ బిల్ కలెక్టర్ రజినీష్ ఒక పెద్దవయస్కురాలిపై అసభ్యంగా ప్రవర్తించారని.. అతనిపై కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. అర్థరాత్రి వేళ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో పోలీసులు ఒత్తిడికి గురైనట్లుగా చెబుతున్నారు. చివరకు దెబ్బలు తిన్న రజనీశ్ పై కేసు నమోదు చేయటంతో ధర్నాను విరమించారు. ఈ ఉదంతంపై విద్యుత్ ఉద్యోగులు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా దాడి చేయటమే కాదు.. ఉల్టా కేసు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా పరిణామాలు ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయటమేనని చెబుతున్నారు. మరి.. దీనిపై రేవంత్ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.