మైలేజీలో తేడా.. మహీంద్రా సంస్థకు హైదరాబాద్ కమిషన్ ఫైన్
బల్కంపేటకు చెందిన సతీష్ కుమార్ తాడ్ బండ్ లోని నియాన్ మోటార్స్ లో 2023 మార్చిలో ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును రూ.19.63 లక్షలకు కొనుగోలు చేశారు.
By: Tupaki Desk | 26 April 2025 12:00 PM ISTవాహనాల్ని అమ్మే వేళలో షోరూంకు చెందిన వారు చెప్పే మాటలకు.. వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం అప్పుడప్పుడు ఉంటూ ఉంటుంది. అయితే.. ఈ తేడా కొద్ది మొత్తంలో అయితే ఫర్లేదు. అందుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకుంటే.. వినియోగదారుల కమిషన్ అండగా నిలుస్తుందన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. మైలేజీ విషయంలో వినియోగదారుడికి సదరు కార్ల షోరూం.. కార్ల సంస్థ చెప్పిన దానికి.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉండటంపై హైదరాబాద్ వినియోగదారుల హక్కుల కమిషన్ స్పందించటమే కాదు.. ఫైన్ షాకిచ్చింది. అసలేం జరిగిందంటే..
బల్కంపేటకు చెందిన సతీష్ కుమార్ తాడ్ బండ్ లోని నియాన్ మోటార్స్ లో 2023 మార్చిలో ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును రూ.19.63 లక్షలకు కొనుగోలు చేశారు. సంప్రదింపుల సమయంలో 100 శాతం ఛార్జింగ్ తో 456 కిలోమీటర్లు తిరుగుతుందని.. 80 శాతం ఛార్జింగ్ తో 364కి.మీ. తిరుగుతుందని తెలిపారు. అయితే.. షోరూంలో చెప్పిన దానికి భిన్నంగా 240కిలోమీటర్లు కూడా మైలేజీ రాకపోవటంతో నియాన్ మోటార్స్ ను సంప్రదించారు.
దీంతో షోరూంను సంప్రదించగా.. వారు సర్వీసుకు పంపారు. అయినా కూడా మైలేజీ కిలోమీటర్ కూడా పెరగలేదు. దీంతో.. తనకు ఎక్సైంజ్ లో మరో వాహనాన్ని ఇవ్వాలని కోరారు. అందుకు షోరూం ససేమిరా అంది. దీంతో.. బాధితుడు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థలు కంప్లైంట్ చేసిన వినియోగదారుడి ఆరోపణల్ని ఖండించింది. దీంతో టెస్ట్ డ్రైవ్ లో 11 శాతం బ్యాటరీ ఖర్చుతో 23.7కి.మీ. వచ్చినట్లుగా రిపోర్టు వెల్లడించింది.
దీంతో.. ఫిర్యాదుదారుడి కంప్లైంట్ పై స్పందించిన కమిషన్ కార్ల తయారీ సంస్థను.. షోరూంకు ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కంప్లైంట్ చేసిన వ్యక్తి మానసిక వేదనను పరిగణలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం.. కేసు ఖర్చుల కోసం రూ.10 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లో పరిహారం చెల్లించని పక్షంలో 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
