Begin typing your search above and press return to search.

ఏమిటీ ఎలక్ట్రోరల్ బాండ్లు.. సుప్రీం తీర్పుతో ఏమవుతుంది?

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు విరాళాల్ని అందజేయటం తెలిసిందే. అయితే.. అలా విరాళాలు ఇచ్చిన వివరాలు బయటకు వచ్చే వీలుంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:13 AM GMT
ఏమిటీ ఎలక్ట్రోరల్ బాండ్లు.. సుప్రీం తీర్పుతో ఏమవుతుంది?
X

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకున్న వారు విరాళాల్ని అందజేయటం తెలిసిందే. అయితే.. అలా విరాళాలు ఇచ్చిన వివరాలు బయటకు వచ్చే వీలుంది. ఒకవేళ సంస్థలు అయితే.. ఆ వివరాలు వెల్లడి అవుతాయి. అయితే.. ఇలా కాకుండా ఉండేందుకు తీసుకొచ్చిన విధానమే ఎన్నికల బాండ్లు. ఈ బాండ్ల ద్వారా ఎవరి డబ్బులు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలు తెలిసే వీల్లేదు. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ బాండ్ల జారీ.. ఆ వివరాలు గుట్టుగా ఉంచటాన్ని తప్పు పట్టటమే కాదు.. దాని కారణంగా పారదర్శకత లోపిస్తుందని పేర్కొనటం తెలిసిందే. సంచలనంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి? అవెలా పని చేస్తాయి? తాజా తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఇందుకు ప్రధాన రాజకీయ పక్షాల స్పందన ఎలా ఉండనుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

ఎన్నికల బాండ్లను ప్రామిసరీ నోట్ లా పేర్కొనవచ్చు. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభిస్తాయి. వ్యక్తులు.. కంపెనీలు వీటిని కొనుగోలు చేసే వీలుంది. అలా బాండ్లను కొనుగోలు చేసి.. వాటిని తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. అలా తమకు వచ్చిన ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు బ్యాంకులకు జమ చేసి.. నగదుగామార్చుకునే వీలుంది.

అలా వచ్చిన విరాళాల్ని తమ ఖర్చుల కోసం వినియోగించుకునే వీలుంటుంది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ఈ బాండ్ల పథకాన్ని 2018లో అమల్లోకి తీసుకొచ్చింది. అయితే.. ఇక్కడే ఒక లింకు పెట్టింది. అదే పలువురిని కోర్టును ఆశ్రయించేలా చేసింది. రాజకీయ పార్టీలు తాము స్వీకరించే విరాళాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017ను సవరణ చేసింది. దీని కారణంగా కొన్నికంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేసి.. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అందించే వీలుంది. ఈ వివరాలేవీ అధికారికంగా బయటకు రావు. దీని వల్ల తమకు బాండ్ల రూపంలో సాయం చేసిన కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలో ఉన్న వేళ.. సాయం చేయటం కామన్. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు తెర తీసే అవకాశం ఉన్న ఈ అంశాన్ని పలువురు తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా.. ఇది తప్పు అని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో.. ఇప్పటివరకు ఈ తరహాలో లబ్థి పొందే రాజకీయ పార్టీలకు సుప్రీంతీర్పు ఇబ్బందికరంగా మారటం ఖాయం.

ఈ అంశంపై సుప్రీంలో జరిగిన విచారణ సందర్భంగా పిటిషన్ దారులు లేవనెత్తిన అభ్యంతరాలు ఒకలా ఉంటే.. వాటికి కౌంటర్ గా కేంద్రం తన వాదనను వినిపించింది. పిటిషనర్ల తరఫు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి రూ.5,127.97 కోట్లు వస్తే.. మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం రూ.1783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ గణాంకాలు ఒక్కటి చాలు.. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయన్న విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా పిటిషనర్ల వాదనలు

- కేంద్రం తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత కొరవడుతోంది.

- ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది.

- అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించకపోగా.. అవినీతికి అస్కారం ఇస్తుంది.

- ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటివరకు సమకూరిన నిధుల్లో అత్యధికం కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి.

- విపక్ష పార్టీలకు తక్కువ మొత్తంలోనే బాండ్లు వచ్చాయి. (ఈ సందర్భంగా గణాంకాలతో సహా పరిస్థితిని వివరించారు)

కేంద్రం వాదనలు ఇవే

- ఎన్నికల్లో బ్లాక్ మనీని ప్రపంచంలోని అనేక దేశాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

- నల్లధనాన్ని అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపు విధానాల్ని అనుసరిస్తున్నాం.

- 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు తీసుకున్నాం.

- స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలు అందేలా చూసేందుకే ఎన్నికల బాండ్ల పథకానికి కేంద్రం ప్రయత్నం చేసింది.

ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు

- ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలు ఉన్నాయి.

- గోప్యత.. విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది.

- ఎస్ బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరెంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకునే వీలు ఉంటుంది. విపక్షంలో ఉన్న వారికి అవకాశం ఉండదు.

- అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు ఈ పథకంలోని పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది.