Begin typing your search above and press return to search.

ఎలక్టోరల్ బాండ్లలో 'మేఘా' హవా... బీఆరెస్స్-వైసీపీ-టీడీపీ లెక్కలివే!

అవును... ఈ నెల 14నాటికి రెండు జాబితాలను విడుదల చేసిన ఎస్బీఐ.. తాజాగా ఎలక్టోరల్ బాండ్స్ మూడో జాబితానూ ఈసీకి వెల్లడించింది.

By:  Tupaki Desk   |   22 March 2024 5:10 AM GMT
ఎలక్టోరల్  బాండ్లలో మేఘా హవా... బీఆరెస్స్-వైసీపీ-టీడీపీ  లెక్కలివే!
X

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్చి 21న ఎలక్టోరల్ బాండ్స్ స్కీం గురించిన అన్ని వివరాలను.. భారత ఎన్నికల సంఘంతో పంచుకున్నట్లు ప్రకటించింది! బ్యాంకు కలిగిఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలనూ బేషరతుగా వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఈ నెల 14నాటికి రెండు జాబితాలను విడుదల చేసిన ఎస్బీఐ.. తాజాగా ఎలక్టోరల్ బాండ్స్ మూడో జాబితానూ ఈసీకి వెల్లడించింది. ఈ జాబితాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రీజనల్ పార్టీలు అయిన బీఆరెస్స్, టీడీపీ, వైసీపీలకు అందిన భారీ విరాళాల జాబితా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ మూడు పార్టీలకూ భారీ విరాళాలు ఇచ్చిన సంస్థల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ కామన్ గా ఉండటం గమనార్హం.

అలా అని తెలుగువారిదే అయిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విరాళాలు ఇచ్చిందనుకుంటే పొరపాటే సుమా! దేశంలోని దాదాపు 11వేల కోట్ల పైచిలుకు సొమ్ములు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందగా... వాటిలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 1,368 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా... వారి తర్వాత అత్యధికంగా 966 కోట్ల విరాళాలను పార్టీలకు ముట్టజెప్పిన సంస్థగా మేఘా ఇంజినీరింగ్ నిలిచింది!

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఏయే పార్టీకి ఏయే కంపెనీల ద్వారా ఎంతమేర విరాళాలు ముట్టాయి.. అందులో మూడు పార్టీలలోనూ మేఘా ఇంజినీరింగ్ వాటా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం!!

భారత రాష్ట్ర సమితి (బీఆరెస్స్):

బీఆరెస్స్ కు అందిన ఎలక్టోరల్ బాండ్ల డేటాలో టాప్ ప్లేస్ లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిలిచింది! ఇందులో భాగంగా ఈ సంస్థ బీఆరెస్స్ కు రూ. 195 కోట్ల విరాళాలు అందించినట్లు తెలుసుంది. అనంతరం.. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్.. బీఆరెస్స్ కు రూ.94 కోట్ల విరాళాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత జాబితాలో చెన్నై గ్రీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 50 కోట్లు ఇచ్చింది!

ఇదే క్రమంలో... డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు, హెటిరో ల్యాబ్స్ రూ. 20 కోట్లు, దివీస్ ల్యాబ్స్ రూ. 20 కోట్లు భారత రాష్ట్ర సమితి (బీఆరెస్స్) కు అందజేసినట్లు తెలుస్తుంది.

వైఎస్సార్సీపీ:

ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ విషయానికొస్తే... ఈ సంస్థకు భారీగా మొత్తంలో రూ.150 కోట్లను ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ సంస్థ విరాళం ఇచ్చింది! ఆ తర్వాత మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 37 కోట్ల రూపాయల విరాళాన్ని వైసీపీకి ఇచ్చింది! ఇదే సమయంలో ది రాంకో సిమెంట్స్ రూ. 24 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇదే క్రమంలో ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 17 కోట్లు, ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 17 కోట్లు, స్నేహ కైనటిక్ పవర్ ప్రాజెక్ట్స్ రూ. 10 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ):

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో గతంలో ఏపీలో అధికారంలో ఉండి, ఈ దఫా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అత్యధికంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 40కోట్లు విరాళంగా ఇచ్చింది. అనంతరం... మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 28 కోట్లు విరాళంగా ఇవ్వగా... వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ రూ. 20 కోట్లు విరాళంగా ఇచ్చాయి.

ఇదే క్రమంలో... నాట్కో ఫార్మా రూ. 14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రూ.13 కోట్లు, భారత్ బయోటిక్ రూ. 10 కోట్లు విరాళాలుగా ఇచ్చినట్లు చెబుతున్నారు.