Begin typing your search above and press return to search.

ఎలక్టోరల్ బాండ్స్ లో సీబీఐ, ఈడీ ఎంట్రీ ఉంటుందా?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది.

By:  Tupaki Desk   |   22 March 2024 5:45 AM GMT
ఎలక్టోరల్  బాండ్స్  లో సీబీఐ, ఈడీ ఎంట్రీ ఉంటుందా?
X

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన కంపెనీలు కొన్ని ఆయా రాజకీయ పార్టీలకు వందల కోట్ల రూపాయలు విరాళాలుగా ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇది ఒకరకమైన క్విడ్ ప్రోకో అని.. పుణ్యానికి ఇవ్వాలంటే దేవాలయాలకు, స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇస్తారు కానీ... రాజకీయ పార్టీలకు ఇవ్వరని.. ఈ విషయంపై సీబీఐ, ఈడీల ఎంట్రీ ఉండాలనే డిమాండ్ విద్యావంతుల నుంచి వినిపిస్తుంది!

అవును... తాజాగా విడుదలైన ఎలక్టోరల్ బాండ్ల వివరాల్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ)కి మొత్తం రూ. 2,123 కోట్లు విరాళంగా అందించగా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ)కి రూ. 1,198 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ. 615 కోట్లు విరాళంగా ఇచ్చారని డేటా తెరపైకి వచ్చింది. అంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలోని పార్టీకి అత్యధికంగా వేల కోట్ల విరాళాలు దక్కాయన్నమాట.

ఈ విషయంలో భారీగా విరాళాలు ఇచ్చిన కంపెనీల విషయంలో క్విడ్ ప్రోకో అనే అశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది! పైగా జాతీయ మీడియాలో ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఉదాహరణకు... మేఘా ఇంజినీరింగ్ కంపెనీ రూ. 14,400 కోట్ల థానే-బోరివాలి జంట సొరంగం ప్రాజెక్ట్‌ కు టెండర్‌ ను దక్కించుకోగా... ఏప్రిల్ 11 - 2023న రూ. 140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌ లను కొనుగోలు చేసిన ఒక నెల తర్వాత యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు.

ఆ రూ.140 కోట్లలోనూ ప్రధానంగా రూ. 115 కోట్లు భారతీయ జనతాపార్టీకి విరాళంగా అందించగా.. మిగిలిన రూ. 25 కోట్లను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)లకు పంచిందనే విషయం మీడియాలో వైరల్ గా మారింది! అయితే... మేఘా సంస్థ కూడా ఆదాయపు పన్ను శాఖ స్కానర్‌ లో ఉందని తెలుస్తుంది!

ఇక ఎలక్టోరల్ బాండ్ల డాటా బయటకు రాగానే దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయిన పేరు "లాటరీ కింగ్" శాంటియాగో మార్టిన్ కంపెనీ అయిన... ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏప్రిల్ 2019 - జనవరి 2022 మధ్య ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 1,368 కోట్ల విరాళాలతో ఈ సంస్థ అతిపెద్ద దాతగా రికార్డులకెక్కింది. అయితే... ఈ మొత్తంలో రూ.100 కోట్లు మాత్రమే అధికార బీజేపీ పార్టీకి విరాళంగా అందాయని తెలుస్తుంది.

ఈ క్రమంలో... పశ్చిమ బెంగాల్‌ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ. 542 కోట్లు.. తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కి 503 కోట్ల రూపాయల విరాళాలను ఈ సంస్థ అందించింది! ఈ తర్వాత జాబితాలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ. 154 కోట్లు దక్కగా.. కాంగ్రెస్ రూ. 50 కోట్లు.. సిక్కిం ఆధారిత పార్టీలకు రూ. 8 కోట్లు దక్కాయని తెలుస్తుంది.

ఇక మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విషయానికొస్తే... ఈ సంస్థ బీజేపీకి రూ.250.15 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ లను విరాళంగా అందించింది. అంటే... ఆ సంస్థ కొనుగోలు చేసిన మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ (రూ. 400.65కోట్లు)లో సగానికిపైగా బీజేపీకి వెళ్లాయన్నమాట. అయితే... రాజస్థాన్‌ లోని బార్మర్‌ తో సహా దేశంలోని అనేక మైనింగ్, చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో ఈ కంపెనీ క్రమం తప్పకుండా పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఈ విధంగా దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన సంస్థలకు సంబంధించిన తెర వెనుక అంశాలు ఇవంటూ కొన్ని కథనాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి! దీంతో... ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ ల ఎంట్రీ ఉంటుందా? ఈ విషయంలో సీబీఐ, ఈడీలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఈ వ్యవహారంపై సుప్రీం ఏ స్థాయిలో సీరియస్ అవుతుంది? అనే అంశాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఏప్రిల్ లో తొలివిడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!!