Begin typing your search above and press return to search.

ఎలక్షన్ డ్యూటీనా? పెళ్లి చేస్తేనే చేస్తానన్న టీచర్!

ఎన్నికలు అన్నంతనే రాజకీయ నేతలు.. డబ్బులు.. వివాదాస్పద వ్యాఖ్యలు.. గెలుపు కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే ఉండవు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:28 AM GMT
ఎలక్షన్ డ్యూటీనా? పెళ్లి చేస్తేనే చేస్తానన్న టీచర్!
X

ఎలక్షన్ డ్యూటీ వేసిన అధికారుల్ని బిత్తరపోయేలా చేసిన టీచర్

ఎన్నికలు అన్నంతనే రాజకీయ నేతలు.. డబ్బులు.. వివాదాస్పద వ్యాఖ్యలు.. గెలుపు కోసం చేసే ప్రయత్నాలు మాత్రమే ఉండవు. అంతకుమించిన సంగతులు చాలానే ఉంటాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకోవటంలో కీలక పాత్ర పోషించే ఎన్నికల అధికారులు.. సిబ్బంది పడే శ్రమ అంతా ఇంతా కాదు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ తమకు అప్పగించిన ఎలక్షన్ డ్యూటీని పూర్తి చేసి.. హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకోవటం చాలామందినే చూస్తాం. కొందరైతే.. ఏమైనా చేస్తాం కానీ ఎన్నికల విధుల్ని ఏదోలా తప్పించుకునే ప్రయత్నం చేసేటోళ్లు కనిపిస్తారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి అందరిని ఆకర్షిస్తోంది.

2024 మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ గా అభివర్ణిస్తున్న ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద ఉంటాయని చెప్పక తప్పదు. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో ఒక టీచర్ తనకు అప్పగించిన ఎన్నికల విధుల వేళ.. సిత్రమైన డిమాండ్ ను తీసుకొచ్చి వార్తల్లోకి వచ్చాడు. ఎన్నికల విధుల్ని తాను నిర్వహించలేనన్న టీచర్.. అందుకు చెప్పిన కారణం ఉన్నతాధికారుల నోట మాట రాకుండా చేసింది.

తాను ఎన్నికల నిర్వహణ శిక్షణకు హాజరు కాలేనని చెప్పిన సదరు టీచర్.. తనకు పెళ్లి చేస్తేనే ఎన్నికల విధులకు హాజరవుతానని చెప్పటం విశేషం. ఇతగాడి పేరు అఖిలేశ్ కుమార్ మిశ్రా. మధ్యప్రదేశ్ లోని సాత్నాకు చెందిన ఈ సంస్క్రత టీచర్ ఎలక్షన్ డ్యూటీ విషయంలో మడత పేచీ పెట్టాడు. ఇంతకూ జరిగిందేమంటే.. ఎన్నికల విధులకు సంబంధించిన ట్రైనింగ్ కు మిగిలిన వారికి మాదిరే అతనికి డ్యూటీ వేశారు. అయితే.. అతను ట్రైనింగ్ క్లాసులకు హాజరు కాలేదు. ఈ క్రమంలో అతను ఎందుకు గైర్హాజరు అయ్యారో తెలపాలంటూ వివరణ కోరారు.

దీనికి బదులిచ్చిన అఖిలేశ్.. తనకు ఇప్పటికే 35 ఏళ్లు దాటాయని.. ఇప్పటివరకు పెళ్లి కాలేదని.. బ్యాచిలర్ గా ఉండలేకపోతున్నానని.. భార్య లేకుండా ఒంటరిగా జీవితాంతం ఉండాల్సి వస్తుందన్న భయంతో తాను ఉన్నట్లుగా పేర్కొన్నాడు. అందుకే తనకు ముందు పెళ్లి చేయాలని.. ఆ తర్వాతే ఎలక్షన్ డ్యూటీకి వస్తానని పేర్కొన్నాడు. దీంతో అతడికి ఏం సమాధానం చెప్పాలో అధికారులకు అర్థం కాని పరిస్థితి. ఇతగాడి తెలివి ఏ స్థాయిలో ఉందంటే.. తాను పెళ్లి చేసుకోవాలంటే రూ.3లక్షల కట్నంతో పాటు ఒక ప్లాట్ ఇవ్వాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చాడు.

ఇతగాడి వాదనకు చిర్రెత్తిన జిల్లా కలెక్టర్ అతడ్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. అతడి సస్పెన్షన్ కు పెళ్లి కారణాన్ని ప్రస్తావించకుండా.. సెల్ ఫోన్ వాడకుండా ఉండటాన్ని ప్రస్తావిస్తూ అతడ్ని సస్పెండ్ చేశారు. అయితే.. ఈ విషయంలో సదరు ఉపాధ్యాయుడికి సమాచారం నేరుగా అందించలేదని.. అతడితో పని చేసే మరో టీచర్ కు తెలిసి.. ఈ విషయం బయటకు రావటంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి చేస్తేనే ఎన్నికల విధులకు హాజరవుతానన్న సదరు టీచరు వింత డిమాండ్ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.