Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఎందుకు ఇచ్చింది?

ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తోంది.

By:  Tupaki Desk   |   17 April 2024 7:45 AM GMT
కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఎందుకు ఇచ్చింది?
X

ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ పై కేసు నమోదు చేశారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని సూచించింది.

గురువారం ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. గడువులోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో కేసీఆర్ వివరణ ఇచ్చుకోవాలి. ఆయన ఇచ్చే వివరణపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు.

మరో కేసులో బీజేపీ ఎంపీ హేమామాలిని విషయంలో కించపరిచే వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ నూర్జేవాలాపై ఎ్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. లోక్ సభ ఎన్నికల్లో ఇదే మొదటి కేసుగా గుర్తింపు పొందడం గమనార్హం.

హేమామాలినిపై ఆరోపణలు చేసిన నూర్జేవాలాకు ఎన్నికల సంఘం నోటీసులు కూడా అందజేసింది. అతడు ఇచ్చే వివరణపై ఈసీ చర్యలు తీసుకోనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం నూర్జేవాలాపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలంలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారులు కూడా ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించింది. ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే శిక్షార్హులే. ఎలాంటి సభలు, సమావేశాల్లో పాల్గొన కూడదు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విరుద్ధ చర్యలు తీసుకుంటే కచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనకాడమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.