Begin typing your search above and press return to search.

జనసేనకు ఈసీ షాక్... ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు!

పార్టీ సింబల్ ని ప్రమోట్ చేస్తుకుంటున్నారనే కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి! ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సింబల్ విషయంలో షాక్ తగిలింది

By:  Tupaki Desk   |   2 April 2024 8:39 AM GMT
జనసేనకు ఈసీ షాక్... ఫ్రీ సింబల్స్  జాబితాలో గాజు గ్లాసు!
X

పవన్ కల్యాణ్ తమ పార్టీ గుర్తు "గాజు గ్లాసు"ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను నటించే సినిమాల్లో సైతం ఈ గుర్తును ప్రమోట్ చేస్తుంటారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ లో భాగంగా... "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. కచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం" అంటూ డైలాగ్ వదిలారు. ఈ డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే.

ఇలా ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా.. తన పార్టీ సింబల్ గాజు గ్లాసును పవన్ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో.. నిన్నమొన్నటివరకూ పలు నియోజకవర్గాల్లో జనసైనికులు టీ దుకాణాల వద్ద గాజు గ్లాస్ లో కొంత సమయం వ్యవధిలో ఉచితంగా తేనీరు పంపిణీ చేస్తూ, పార్టీ సింబల్ ని ప్రమోట్ చేస్తుకుంటున్నారనే కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి! ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సింబల్ విషయంలో షాక్ తగిలింది!

అవును... ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో నెలా పదిరోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో... "మేమంతా సిద్ధం" అంటూ వైసీపీ.. "ప్రజాగళం" అంటూ చంద్రబాబులతో పాటు బీజేపీ, జనసేనలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేశాయి. ఈ సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన "గాజు గ్లాసు"ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో... ఇప్పుడు జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట కూటమి పరిస్థితి ఎమిటనే చర్చ తెరపైకి వచ్చింది!

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది! ఇందులో భాగంగా... ఏపీలో వైసీపీ, టీడీపీలతో పాటు.. తెలంగాణలో బీఆరెస్స్, ఎంఐఎం లు గుర్తింపు పొందాయి. దీంతో... తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది. ఇక జనసేన విషయనికొస్తే... గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో కాకుండా... కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే జనసేన పేరు ఉంది!! దీంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.

కాగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి సీఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసి.. ఒక స్థానంలో మాత్రమే గెలుపొందింది! ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చట్టసభల్లో తగిన ప్రతినిధ్యం లేకపోవడం వల్లే... నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ విషయంలో ఈ నిర్ణయం ప్రకటించిందని అంటున్నారు!

దీంతో ఈ విషయంపై జనసైనికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... న్యాయనిపుణులతో చర్చించి ఆ పార్టీ పెద్దలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు!