Begin typing your search above and press return to search.

పెయిడ్ ఆర్టిక‌ల్స్ ప్ర‌సారం చేస్తే.. అంతే: మీడియాకు ఈసీ వార్నింగ్‌

ఏపీలో జ‌ర‌గనున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   15 March 2024 11:30 PM GMT
పెయిడ్ ఆర్టిక‌ల్స్ ప్ర‌సారం చేస్తే.. అంతే:  మీడియాకు ఈసీ వార్నింగ్‌
X

ఏపీలో జ‌ర‌గనున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆయా రాజ‌కీ య పార్టీల‌ అనుకూల‌, ప్ర‌తికూల మీడియాల్లో పెయిడ్‌(చెల్లింపు) ఆర్టిక‌ల్స్‌, వార్త‌లు, ప్ర‌క‌ట‌న‌లు వేస్తే.. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు.. ఆ యా సంస్థ‌ల‌ను బ్లాక్ లిస్టులో పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది. ప్రచార మాధ్యమాల్లో ప్రచురించే, ప్రసారం అయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు.

ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విదానాలపై భారత ఎన్నికల సంఘం(ఈసీ) జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు, సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా సంస్థ‌లు ప్రవర్తించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు ఆయన ప్ర‌త్యేకంగా భేటీ నిర్వ‌హించారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అనుగుణంగా అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తామ‌న్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటా యన్నారు.

నిర్థేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్ ను గణించి, ఆ వ్యయాన్ని సంబందిత అభ్యర్థి ఖాతాలో జమచేస్తామ‌న్నారు. ప‌దేప‌దే ఉల్లంఘిస్తే.. స‌ద‌రు సంస్థ‌ను బ్లాక్ లిస్టులో పెడ‌తామ‌న్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్ సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసన సభ అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అమమతి ఉందన్నారు. అయితే పెయిడ్ న్యూస్ గా నిర్థారణ అయిన ఆర్టికల్స్ కు సంబందించి రేటు కార్డు ప్రకారం ఖరారు చేయబడిన సొమ్మును సంబందిత అభ్యర్థి వ్యయంగా జమచేస్తామ‌ని చెప్పారు.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబందించి కూడా ముందస్తుగా ఎం.సి. అనుమతి పొందాల్సి ఉంటుందని, అనుమతి పొందిన ఆర్డరు కాపీ నెంబరును కూడా సంబందిత ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రచార మాధ్యమాలు తప్పనిసరిగా గమనించాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా చేసే ప్రకటనలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా పరిగణిస్తూ చట్టం ప్రకారం తగు చర్యలు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.