Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... ఇంటినుంచే ఓటు వేయవచ్చు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తాజాగా ముగిసింది

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:46 AM GMT
బిగ్ బ్రేకింగ్... ఇంటినుంచే ఓటు వేయవచ్చు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఎన్నికల కమిషన్ సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త ఓట్లు చేర్చడం, దొంగ ఓట్లు తొలగించడంతో పాటు వివిద రకాలా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తాజాగా ముగిసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. అందులో ముఖ్యంగా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం తీసుకొచ్చినట్లు తెలిపారు.

అవును... దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్లు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సీఈసీ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... పోలింగ్ బూత్ లకు రాలేని సీనియ ర్ సిటిజన్లు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

అయితే ఈ ఆఫ్షన్ పొందాలంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదురోజుల్లోగా 12డి ఫారం కింద దరఖాస్తూ చేసుకోవాలి. ఒకవేళ పోలింగ్ బూత్ కి వస్తామంటే మాత్రం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని సీఈసీ తెలిపారు.

ఇక 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని తెలిపిన సీఈసీ మరణాలు ఉన్నా ధృవీకరణ పత్రం అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఇదే సమయంలో పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని తెలిపిన ఆయన... ప్రతి ఒక్కరూ ఓటింగ్‌ లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు తెలిపిన రాజీవ్‌ కుమార్‌.. స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామమని అన్నారు. ఇదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం (8,11,640) ప్రశంసనీయమని తెలిపారు. ఇదే క్రమంలో... 80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షల మంది ఉండగా... 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7,689 గా ఉన్నట్లు సీఈసీ పేర్కొన్నారు.

ప్రకటనలు – సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని, అదేవిధంగా... అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో ఆన్ లైన్ లో నగదు బదిలీల పై ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుందని.. ఇదే సమయంలో ఎలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా ఉందని అన్నారు.

ఇదే సమయంలో అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే " సి విజిల్" యాప్‌ లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయని, ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

కాగా... తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అనంతరం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ ఈ వివరాలు వెల్లడించారు.