Begin typing your search above and press return to search.

గుడివాడ‌లో పోటీకి 'కొడాలి' అన‌ర్హుడు: ఎన్నిక‌ల సంఘం సంచ‌లన నిర్ణ‌యం!

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ''ఎన్నిక‌ల్లో పోటీకి కొడాలి అన‌ర్హుడు'' అని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే తేల్చి చెప్పింది

By:  Tupaki Desk   |   25 March 2024 3:39 AM GMT
గుడివాడ‌లో పోటీకి కొడాలి అన‌ర్హుడు:  ఎన్నిక‌ల సంఘం సంచ‌లన నిర్ణ‌యం!
X

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ''ఎన్నిక‌ల్లో పోటీకి కొడాలి అన‌ర్హుడు'' అని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే తేల్చి చెప్పింది. అయితే.. ఇక్క‌డ కొంచెం ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే.. మీరు అనుకుంటున్న‌ట్టు కొడాలి అంటే.. కొడాలి నాని కాదు.. 'కొడాలి వెంక‌టేశ్వ‌ర‌ రావు' అనే వ్య‌క్తిని అన‌ర్హుడిగా ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కూడా కొడాలి వెంక‌టేశ్వ‌రరావే. అయితే.. ఈయ‌న పేరులో 'శ్రీ' ఉంటుంది. అయితే.. స‌హజంగా ఎన్నిక‌ల్లో ఇలాంటి తారుమార్లు ష‌రా మామూలుగా మారాయి. అంటే.. ఒకే ఇంటి పేరు.. ఒంటి పేరు ఉన్న వారు ఎన్నిక‌ల్లో పోటీ చేసి.. ఓట్లు దారిమ‌ళ్లించ‌డం అనే వ్యూహాలు కొత్త‌కాదు.

ఈ క్ర‌మంలోనే ఒకే పేరు ఉన్న కొందరు వ్యక్తులు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. త‌న పేరును ఎన్నిక‌ల పోటీకి పంపించారు. అయితే, గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(కొడాలి నాని) మరోసారి బరిలోకి దిగుతున్నారని తెలిసిందే. ఇవే తనకు చివరి ఎన్నికలు అని సైతం కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌రావు.. ఒక్క పేరుతో ఉండ‌డంతో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని ఎన్నిక‌ల సంఘం అన‌ర్హుడిగా ప్ర‌క‌టించింది.

ఏపీలో ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియో జకవర్గాల్లో మొత్తంగా 51 మంది త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 10ఏ ప్రకారం జాబితాలోని 51 మంది వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లోనూ అందుబాటులో ఉంచుతామని ఈసీ స్పష్టం చేసింది. వీరిలో కొడాలి నాని పేరును పోలిన వ్య‌క్తితో పాటు.. దేవినేని ఉమ్మ‌మ‌హేశ్వ‌ర‌రావు కూడా ఉన్నారు. (టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేరును పోలిన పేరు)

నిఘా ముమ్మ‌రం..

ఈ నెల‌ 16న కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. నగదు బదిలీలు, నగదు తరలింపు, బంగారం సహా పెద్ద ఎత్తున చీరలు సహా ఇతరత్రా సామాగ్రి ఓటర్లకు పంపిణీపై ఎన్నికల అధికారులు ఫోకస్ చేశారు. ఏపీలో ఇదివరకే పలుచోట్ల నగదు, మద్యం పట్టుబడగా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుంటోంది.