Begin typing your search above and press return to search.

ఈసీలో చీఫ్ జస్టిస్ ప్రాధాన్యానికి కత్తెర

ఈసీలో నియామకాలను చేపట్టే ప్యానల్ నుంచి సీజేఐను తప్పించి కేంద్ర కేబినెట్ మంత్రికి చోటివ్వనున్నట్లు సమాచారం

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:39 AM GMT
ఈసీలో చీఫ్ జస్టిస్ ప్రాధాన్యానికి కత్తెర
X

ఇప్పటికే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం-సుప్రీం కోర్టు మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయి. తరచూ వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రిజిజు కొలీజియం వ్యవస్థపై విరుచుకుపడేవారు. అదంతా సద్దుమణిగిందని అనుకుంటుండగా.. మరో కీలకం అంశం తెరపైకి వచ్చింది. అది సాదాసీదా ఏమీ కాదు.. ఏకంగా ఎన్నికల సంఘానికి సంబంధించినది కావడం గమనార్హం.

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ) నియామకాలను నియంత్రించేందుకు కేంద్రం చట్టం తేనుంది. దీనికి సంబంధించిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెటింది. ఈసీ నియామకాలను చేపట్టే ప్యానల్ నుంచి ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

సీజేఐ స్థానంలో మంత్రి..

ఈసీలో నియామకాలను చేపట్టే ప్యానల్ నుంచి సీజేఐను తప్పించి కేంద్ర కేబినెట్ మంత్రికి చోటివ్వనున్నట్లు సమాచారం. ఈ మంత్రిని కూడా ప్రధాని నామినేట్ చేస్తారు. మూడో సభ్యుడు లోక సభలో ప్రతిపక్ష నేత కాగా ప్యానెల్ కు చైర్మన్ గా ప్రధాని ఉంటారు. తాజాగా పెట్టిన బిల్లులోనూ ఈసీ నియామకాలను ఈ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని ప్రతిపాదించారు. కాగా, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై మార్చిలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

దానిప్రకారం నియామకాలను.. ప్రధాని, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. కానీ, ఈసీల నియామకాల కోసం కొత్త చట్టం తెచ్చేవరకు ముగ్గురు సభ్యుల కమిటీ మనుగడలో ఉంటుందని మాత్రం తేల్చిచెప్పింది.

అయితే.. ఈసీ నియామకాల కోసం బిల్లును రూపొందించిన కేంద్రం.. కమిటీలో ఏకంగా సీజేఐనే తప్పించింది. ఇది తీవ్ర చర్చనీయాంశం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేసింది. పార్లమెంటు సమావేశాలు శుక్రవారంతో ఆఖరు. చివరి రోజు ఈసీల అంశంపై దుమారం రేగే అవకాశం ఉంది.