ఐదు రాష్ట్రాల ఎన్నికలు : పది రోజుల్లో 70 వేల ఫిర్యాదులు!! రూ.400 కోట్లు స్వాధీనం
తొలివిడత పోలింగ్ జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల అవకతవకలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
By: Tupaki Political Desk | 27 March 2026 5:00 AM ISTఐదు రాష్ట్రాల ఎన్నికల్లో క్రమంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తొలివిడత పోలింగ్ జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల అవకతవకలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈసీ వెలువడించిన లెక్కలు పరిశీలిస్తే ఎన్నికలు ఎంత వేడిగా సాగుతున్నాయో అర్థమవుతోందని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై కేవలం పదిరోజులే అవ్వగా అప్పుడే దాదాపు 70 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతేకాకుండా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక కాల్ సెంటర్ తోపాటు సి-విజిల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
దేశంలో ఐదు రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు ఈ నెల 15న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై కమిషన్ ప్రత్యేక నిఘా కూడా వేసింది.
అయితే ఈ పది రోజుల్లోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అవకతవకలు జరుగుతున్నట్లు భారీగా ఫిర్యాదులు వచ్చాయి.ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు సి-విజిల్ యాప్ ద్వారా 70,944 ఫిర్యాదులు అందాయని, వీటిలో 70,831 పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 95.8 శాతం ఫిర్యాదులు అంటే సుమారుగా 67,899 ఫిర్యాదులను 100 నిమిషాల లోపే పరిష్కారించినట్లు ఈసీ తెలిపింది. ఇక ఓటర్లు తమ ఫిర్యాదులు, ఇబ్బందులు తెలియజేసేందుకు 1950 నెంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ ప్రారంభించింది.
మరోవైపు ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలకు అవకాశం లేకుండా ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని 100 నిమిషాల్లోపు పరిష్కరించేందుకు 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించింది. వీటితోపాటు ఆకస్మిక తనిఖీల కోసం అదనంగా 5,200 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ మోహరించింది. ఈ తనిఖీ బృందాలు జరిపిన సోదాల్లో దేశవ్యాప్తంగా రూ. 408.82 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుంది.
ఇందులో రూ.17.44 కోట్లు నగదు ఉండగా, రూ.37.68 కోట్ల విలువైన మద్యం కూడా ఉంది. అదేవిధంగా రూ.167 కోట్ల డ్రగ్స్, రూ.23 కోట్ల విలువైన లోహాలు, రూ.163 కోట్ల కానుకలు ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ఇక ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతోపాటు ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎస్, డీజీపీలతో ప్రత్యేక సమావేశమైన ఎన్నికల అధికారులు తనిఖీల సమయంలో సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా గ్రీవెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
