Begin typing your search above and press return to search.

రాష్ట్రాల్లో సర్...రచ్చ స్టార్ట్

దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ తప్పించి మిగిలిన రాష్ట్రాలు అయితే రెడీ కావాల్సిందే అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం.

By:  Satya P   |   24 Sept 2025 4:00 AM IST
రాష్ట్రాల్లో సర్...రచ్చ స్టార్ట్
X

దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ తప్పించి మిగిలిన రాష్ట్రాలు అయితే రెడీ కావాల్సిందే అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతా కలసి ఈ నెల 30వ తేదీ లోపుగా సిద్ధం కావాల్సిందే అని స్పష్టం చేస్తోంది. ఎందుకు అంటే ఈసీ కీలక నిర్ణయాలను అమలు చేయడానికే అని అంటున్నారు. ఇంతకీ ఈసీ తీసుకునే ఆ ముఖ్యమైన నిర్ణయం చూస్తే మరోసారి రాజకీయ రచ్చకు తెర లేవనుందా అన్నది ఇపుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా ఉంది.

సర్ అంటే ఏంటి :

ఈ సర్ అంటే ఆర్యా అని తెలుగు పదం కాదు, మర్యాదపూర్వకమైన పలకరింపు అన్న అర్థం అంతకంటే కాదు. ఆ సర్ వేరు, ఈ సర్ వేరు. ఈ సర్ షార్ట్ కట్ గా ఉంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ అన్న మాట. దీనినే సర్‌గా వాడుకలో పిలుస్తున్నారు. ఇక తెలుగులో తీసుకుంటే ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ అని చెప్పాల్సి ఉంటుంది. ఇపుడు దాదాపుగా రాజకీయాల మీద అవగాహన ఉన్న వారి అందరికీ ఈ సర్ ఏంటో అర్ధం అయ్యే ఉంటుంది. బీహార్ లో సర్ అమలుతోనే జరిగిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు, ఏకంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నెల రోజూలూ ఈ ఆందోళనకే సరిపోయాయి. విపక్షాలు ముక్తకంఠంతో సర్ ని అమలు చేయవద్దు అని అంటున్నారు. దీని మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది.

విచారణ దశలో ఉండగానే :

ఇక ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ విషయంలో ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. దాంతో బీహార్ ఎన్నికల సమయంలోనే సర్‌ ను ఎందుకు నిర్వహిస్తునారు అని ఈసీని సూటిగానే ప్రశ్నించిన సందర్భం ఉంది. అంతే కాదు ఈ విషయంలో ఈసీని సుప్రీంకోర్టు నిలదీసిందని విపక్షాలు గుర్తు చేస్తున్నారు. ఇక చట్టవిరుద్ధంగా సర్‌ ఉన్నట్టు తేలితే కనుక దానిని రద్దు చేస్తామని కూడా సుప్రీం కోర్టు గట్టిగానే హెచ్చరించింది. ఇక బీహార్‌లో అమలైన సర్‌ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్‌ 7న తుది వాదనలు వింటామని కోర్టు వెల్లడించింది. ఇలా అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణలో ఉన్న నేపధ్యంలోనే అన్ని రాష్ర్టాలలో సర్‌ ను అమలు చేయడానికి ఈసీ రెడీ అవుతోంది. దాంతో ఇపుడు ఇదే అంతటా హాట్ డిస్కషన్ గా మారుతోంది.

రెడీగా ఉండాలని సీఈవోలకు ఆదేశం :

దేశంలోని రాష్ట్రాలు అన్నీ కూడా సర్ అమలుకి సిద్ధంగా ఉండాలని ఈసీ రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఇప్పటికే ఆదేశించింది. గతంలో చేపట్టిన ఓటర్ల జాబితాలను దగ్గర పెట్టుకోవాలని సూచించింది. ప్రతీ రాష్ట్రంలో సర్ ఆధారంగా ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తోంది. ఇక సర్ ప్రక్రియను అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈసీ సర్వం సిద్ధం చేసుకుంది. ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేసి తుది నివేదికలను తయారు చేసేందుకే ఈ ప్రక్రియ అంటోంది. నవంబర్ తో దీనిని పూర్తి చేయలని అనుకుంటోంది. అంటే రానున్న రెండు నెలలూ సర్ తో రాష్ట్రాలు ఫుల్ బిజీ కావాల్సిందే అన్న మాట.

సర్ ఎందుకు అంటే :

ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎందుకు అంటే ఈసీ చెప్పేది కీలకంగా ఉంది. విదేశీ అక్రమ వలసదారులను తనిఖీ చేయటం ముఖ్య ఉద్దేశ్యం అని అంటోంది. అంత కాదు అలాంటి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించటం సర్‌ ప్రక్రియలో ముఖ్యమైన లక్ష్యమని ఈసీ చెబుతోంది. అంతే కాకుండా తప్పుడుగా ఓటర్లు ఉండడం కూడా ఇందులో చూసి మరీ ఏరివేస్తారు అంటున్నారు. ఎక్కడైనా అనర్హులు ఓటుని సంపాదిస్తే వారిని పక్కన పెట్టేసారు. అందువల్లనే పాత జాబితాలను దగ్గర పెట్టుకుని మరీ సర్ ని చేపడతారు అని అంటున్నారు. ఇది మంచి లక్ష్యం కోసమే అని ఈసీ చెబుతోంది

బీజేపీ కోసమే అంటూ :

అయితే సర్ ప్రక్రియను మొదటికే తప్పుపడుతోంది విపక్షం. ఇది బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించినది గా అనుమానిస్తూ ఆరోపిస్తోంది కూడా. తాము టార్గెట్ చేసిన ఓటర్లను జాబితా నుంచి ఏరివేయటం సర్ లక్ష్యమని అంటోంది. ఈ కారణంతోనే సర్‌ ప్రక్రియను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. మరో వైపు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో దశలో ఉండగా దెశవ్యాప్తంగా ఎందుకు హడావుడిగా సర్ ని అమలు చేయడానికి పూనుకుంటున్నారు అని విపక్షం ప్రశ్నిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సర్ రాజకీయ రచ్చకు కారణం అయ్యేలా ఉందని అంటున్నారు.