ఐదు రోజులు.. ఐదు రాష్ట్రాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే..
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. బెంగాల్ కు రెండు విడతలలో మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించింది.
By: Tupaki Political Desk | 15 March 2026 6:43 PM ISTదేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. బెంగాల్ కు రెండు విడతలలో మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బెంగాల్ లో 294 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో 30 స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో 234 స్థానాలు, కేరళం 140, అస్సాం 126 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాలకు మే, జూన్ నెలలో శాశనసభల పదవీకాలం ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులును పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లోనూ ఇటీవల పర్యటించింది. మరోవైపు బందోబస్తుపై కేంద్ర హోంశాఖతోనూ సంప్రదింపులు పూర్తి చేసింది. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేస్తూ ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి సోమవారమే ఈ ప్రక్రయ చేపడుతుందని అనుకున్నా, ఎన్నికల సంఘం ఒక రోజు ముందే ఈ ప్రకటన చేసింది.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. ఈ రాష్ట్రాల్లో 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 25 లక్షల మంది ఎన్నికల అధికారులను వినియోగించనున్నారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్ కు రెండు విడతల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. గతంలో ఈ రాష్ట్రంలో 8వ విడతలుగా ఎన్నికలు జరిగితే, ఈ దఫా రెండు విడతల్లో పూర్తి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కేరళం, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.
ఇక అన్ని రాష్ట్రాలకు ఒకేసారి కౌంటింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు విడుదలతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 30న తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఏప్రిల్ 6వ తేదీవరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లో తొలివిడతకు కూడా మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలివిడతలో మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 142 స్థానాలకు ఏప్రిల్ 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.
కేరళం, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలకు నిండా నెల రోజుల సమయం కూడా లేకపోవడం గమనార్హం. రికార్డు సమయంలో ఈ రాష్ట్రాల ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసిందని అంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాల పోలింగ్ తేదీకి కౌంటింగ్ కు దాదాపు నెల రోజుల వ్యవధి ఉండటం ఓటర్లను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ మినీ సంగ్రామం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒంటరిగా ఎదుర్కొంటున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుగా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా చెబుతున్నారు.
