కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తాజా నిర్ణయంతో మరణించిన వారి పేర్లతో వేరే వారు దొంగ ఓట్లు వేసే అవకాశానికి చెక్ పెట్టాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన.
By: Tupaki Desk | 2 May 2025 2:00 PM ISTకేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు అనుసరించిన విధానాలకు భిన్నంగా ఓటర్ల జాబితాను డైనమిక్ గా ఉంచే కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఉన్న విధానాల ప్రకారం మరణించిన ఓటర్లను క్రమపద్దతిలో తొలగించటం జరిగేది. అందుకు భిన్నంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు
ఎవరైనా ఓటరు మరణిస్తే.. వారికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తమకే నేరుగా వచ్చేలా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా నుంచి మరణ జాబితాను తీసుకొచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో.. మరణించిన వారి జాబితాతో.. ఓటరల జాబితాలోని పేర్లను పోల్చటం ద్వారా.. వారి పేర్లను డిలీట్ చేసేలా ప్లాన్ చేశారు. తాజా నిర్ణయంతో మరణించిన వారి పేర్లతో వేరే వారు దొంగ ఓట్లు వేసే అవకాశానికి చెక్ పెట్టాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన.
దీంతో పాటు ఓటరు కార్డులో ఓటరుకు సంబంధించిన వివరాల్ని మరింత స్పష్టంగా డిస్ ప్లే అయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పుడున్న డిజైన్ లో మార్పులు చేస్తున్నారు. ఇకపై పెద్ద పెద్ద అక్షరాలతో వీఐఎస్ సీరియల్ నంబరు.. ఓటరు పార్ట్ నంబరు మరింత స్పష్టంగా కనిపించేలా కొత్త డిజైన్ ఉంటుంది. ఈ మార్పుతో తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందన్న విషయాన్ని ఓటరు మరింత సులువుగా చూసుకునే వీలు ఉంటుంది.
మరో ఆసక్తికర నిర్ణయం ఏమంటే.. ఓటరు కార్డులకు సంబంధించి నమోదు చేయటంతో పాటు మార్పులు చేర్పులు చేసే బీఎల్వోలకు ఒక పక్కా ఫోటో గుర్తింపు కార్డుల్ని జారీ చేయనున్నారు. వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఉండటం ద్వారా.. వీరిని తేలిగ్గా గుర్తించే వీలుందని చెబుతున్నారు.
