Begin typing your search above and press return to search.

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి పెను సవాళ్ళు...రాజ్యాంగమే సుప్రీం

దేశంలో ఎన్నికల వ్యవస్థ 1952 లో ప్రారంభం అయింది. దానికంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం 1950 జనవరి 25న ఏర్పాటు అయింది.

By:  Tupaki Desk   |   21 Oct 2026 7:53 PM IST
ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి పెను సవాళ్ళు...రాజ్యాంగమే సుప్రీం
X

దేశంలో ఎన్నికల వ్యవస్థ 1952 లో ప్రారంభం అయింది. దానికంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం 1950 జనవరి 25న ఏర్పాటు అయింది. అలా దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి మధ్య జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రమైన స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ బద్ధ సంస్థగా బలమైన వ్యవస్థగా ఏర్పాటు అయింది. దేశంలో ఎన్నికలు పార్టీలు రాజకీయాలు ఇవన్నీ తాత్కాలికం. ఎన్నికల సంఘం శాశ్వతం. దాని విధానాలు నిర్ణయాలు శిలా శాసనం. ఎన్నికల సంఘం తీసుకునే ఏ నిర్ణయం అయినా వివక్ష పక్షపాతం లేకుండా ఉండాలి అన్నది మొదటి సూత్రం. అలా ఆటలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని అంతా భావించినంతకాలం ఎన్నికల సంఘం మీద చిన్న మెత్తు విమర్శ కూడా రాలేదు. కానీ కాల పరీక్షలో మాత్రం ఎన్నికల సంఘం ముందు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి. దాంతో ఏకంగా ఆ అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ స్వయంప్రతిపత్తికి సైతం ఇబ్బందులు తలెత్తున్నాయని అంటున్నారు.

గొప్ప ఆశయాలతో :

ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఈ దేశ రాజ్యాంగం ఎన్నికల సంఘానికి ఎన్నో విశేష అధికారాలు ఇచ్చింది. దానికి కారణం భారత దేశంలోని భిన్న వర్గాల ప్రాంతాలు భాషలు ఉన్నాయి. అందరినీ ఒకే తీరున చూస్తూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేయడం అన్న బృహత్తర బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంచడమే. ఈ దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన స్వేచ్ఛ నిష్పక్షికతలను స్పూర్తిగా చేసుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సిన కర్తవ్యం ఈ అత్యున్నత సంస్థకు ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు అవుతోందా లేదా అన్నది చూసేందుకు కోర్టులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలలో అమలు కానపుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అయితే ఎన్నికల సంఘం సర్వ స్వతంత్ర సంస్థ కాబట్టి కోర్టులు జోక్యం పరిమితం అన్నది ఉంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజ్యాంగమే సుప్రీం కాబట్టి ఈసీ నిర్ణయాలను సమీక్షించేందుకు కోర్టులు సిద్ధపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది అని అంటున్నారు.

సీఈసీకి వ్యతిరేకంగా :

ఇప్పటికే దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల మీద నిరసనలు జరుగుతున్నాయి. ఓట్ల చోరీ అంటూ విపక్ష కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. సర్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందని లక్ష్యం చేసుకుని ఓట్లను తొలగిస్తున్నారు అన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్లు వచ్చాయి. దాంతో పాటు 2023లో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో మార్పులు విషయంలోనూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం ద్వారా ఈ కమిటీ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చారు. దీనివల్ల ఎంపిక కమిటీలో ప్రభుత్వానికి 2:1 మెజారిటీ లభిస్తుందని, ఇది ఎన్నికల సంఘం నిష్పక్షపాతతత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విమర్శకులు న్యాయ నిపుణులు కోర్టులను ఆశ్రయించారు.

సవరించిన చట్టం ప్రకారం :

ఇదిలా ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేంత కఠినమైన పార్లమెంటరీ ప్రక్రియ అవసరం అవుతోంది. అయితే అదే ఎన్నికల సంఘంలో ఇతర ఎన్నికల కమిషనర్లను కేవలం సీఈసీ సిఫార్సుపై రాష్ట్రపతి తొలగించవచ్చు. ఈ విధమైన అసమానత వల్ల మిగతా కమిషనర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చుననే ఆందోళన సైతం మేధావి వర్గాలలో ఉంది. ఇక ఓటర్ల జాబితా సవరణ విషయంలో విమర్శలు రావడంతో ఎన్నికల సంఘం నిర్ణయాలపై కొన్ని సందర్భాల్లో సొంత కమిషనర్లే భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయడం ప్రజల్లో విశ్వసనీయతపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

విశేష అధికారాలు :

ఇక ఎన్నికల సంఘం విషయానికి వస్తే ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో ఎన్నికల పర్యవేక్షణ నియంత్రణ అధికారాలను పూర్తిగా ఎన్నికల సంఘానికే అప్పగిస్తూ రాజ్యాంగం స్వయంప్రతిపత్తిని ఇచ్చింది. స్వేచ్ఛా నిష్పక్షపాత ఎన్నికలు అనేవి భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. దీనిని మార్చే అధికారం పార్లమెంట్‌కు కూడా లేదు. అయితే ఎన్నికల సంఘం సమగ్రతను కాపాడటానికి న్యాయ వ్యవస్థ నిరంతరం నిఘా ఉంచుతుంది. చట్టాల్లో లోపాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధతను పునరుద్ధరిస్తుంది. ఈ నేపథ్యంలో 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ముఖ్యమైన చట్టాల రాజ్యాంగబద్ధతపై సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై లోతైన రాజ్యాంగపరమైన విశ్లేషణ అవసరమని భావించి, ఈ కేసును ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు. ఇక ఏపీలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు అంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా రాజ్యాంగ విలువలను కాపాడటంలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడంలో తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని కోర్టు స్పష్టం చేసింది.

రిఫరీగా ఉండాల్సిందే :

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు ఎన్నికల సంఘం రిఫరీగా ఉండాల్సిన అవసరం మరింత స్పష్టం అవుతోంది. అంతే కాదు ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నది మేధావుల సూచన. అపుడే రాజ్యాంగం ఆశించిన నిజమైన స్వతంత్రత స్వయంప్రతిపత్తి తో కూడిన ఎన్నికల సంఘాన్ని అంతా చూస్తారని అంటున్నారు. .