ఎల్‌నినో ఎంట్రీ...భారత్ మీద పెను ప్రభావం
వాతావరణ నిపుణులు ఊహించినట్లుగానే ఎల్‌నినో ఎంట్రీ ఇచ్చింది. ఫసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తన ఉనికిని బలంగా చాటుకోవడం ద్వారా సవాల్ చేసినట్లు అయింది.
By: Satya P | 13 Jun 2026 9:52 AM ISTవాతావరణ నిపుణులు ఊహించినట్లుగానే ఎల్‌నినో ఎంట్రీ ఇచ్చింది. ఫసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో తన ఉనికిని బలంగా చాటుకోవడం ద్వారా సవాల్ చేసినట్లు అయింది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ఐఎండీ అధికారికంగా ప్రకటించింది మరీ ముఖ్యంగా భారత్ వంటి దేశాల మీద ఎల్‌నినో ప్రభావం గట్టిగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఈసారి వర్షపాతం రేటు తక్కువగా ఉంటూ కరువు పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక భారత్ లో ఎల్‌నినో ఎంట్రీ ఇచ్చేందుకు మరో రెండు నెలల సమయం ఉందని చెబుతున్నారు.
ఆగస్టు నుంచి ప్రభావం :
ఎల్‌నినో భారత దేశంలో ఆగస్ట్ నెల నుంచి తన ప్రభావాన్ని బలంగా చూపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అప్పటికి నైరుతి తు పవనాలు దేశంలో ఉంటాయి. అయితే వాటి మీదనే ఎల్‌నినో తన ప్రతాపాన్ని చూపిస్తుందని ఫలితంగా అవి మంద గమనంతో ఉండడం అంతే కాకుండా వర్షాభావ పరిస్థితులు కొన్ని చోట్ల ఉండడం వంటివి జరుగుతాయని అంటున్నారు. దాంతో ప్రతీ ఏటా నైరుతి రుతు పవనాల కాలంలో సమృద్ధిగా కురిసే వానలు ఈసారి తక్కువ శాతంగా నమోదు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ జిల్లాల మీద గట్టిగా :
ఇక దేశంలోని ఏకంగా 197 జిల్లాల మీద ఎల్‌నినో ప్రభావం గట్టిగా ఉండొచ్చు అన్న వాతావరణ నిపుణుల సూచనల మేరకు కేంద్రం వాటిని గుర్తించి ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా ఎల్‌నినో పరిస్థితుల
నేపధ్యంలో రాష్ట్రాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను కూడా సిధ్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక దేశ ఆర్ధిక వ్యవస్థకు అత్యంత కీలకమైన నైరుతి రుతు పవనాల మీద ఎల్‌నినో ప్రభావం పడితే ఇబ్బందికరమే అని అంటున్నారు. దేశీయ వ్యవసాయం పూర్తిగా నైరుతి రుతు పవనాల ద్వారా లభించే వర్షాల మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇక దేశంలో నీటి వనరులు కూడా నైరుతిలో కురిసే వానల ద్వారానే బలోపేతం అవుతాయని అంటున్నారు. ఇపుడు వాటి మీదనే ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు అన్న చర్చ సాగుతోంది.
ఎల్‌నినో వల్ల ముప్పు ఇదే :
ఎల్‌నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కిపోతాయి. దాంతో వేడి గాలులు భూమి మీదకు ప్రసరిస్తాయి. ఇవి రుతు పవనాల మీద కూడా ప్రభావం తీవ్రంగా చూపించి వానలను తక్కువగా కురిసేలా కొన్ని సార్లు అసలు లేకుండా చేసేలా కూడా చేస్తాయని అంటున్నారు. గతంలో ఎల్‌నినో ప్రభావం భారత్ లో ఏ విధంగా ఉందో ప్రతికూలత వల్ల కరవు పరిస్థితులు ఏ విధంగా కలిగాయో నిపుణులు చెబుతున్నారు. ఈసారి కూడా అదే మాదిరిగా ఎల్‌నినో ప్రభావం ఉంటుందా అంతకు ముంచి ఉంటుందా అన్నదే చూడాల్సి ఉంది. భారత్ లో ఆగస్టు నాటికి ఎల్‌నినో ప్రభావం గట్టిగా కనిపించవచ్చు అని లెక్క వేస్తున్నారు.
కేంద్రం సమీక్ష :
ఎల్‌నినో ప్రభావం బాగా ఉంటుందని ఐఎండీ పేర్కొనడంతో కేంద్రం అప్రమత్తం అయింది. దీని మీద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే అత్యంత సున్నితంగా ఉన్న 197 జిల్లాలను ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తించామని వెల్లడించారు. అక్కడ తగిన యాక్షన్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయా జిల్లాలలో వర్షాభావ పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తున్నామని, అవసరమైన విత్తనాలు వ్యవసాయ సామగ్రిని ముందుగానే అక్కడ నిల్వ చేశామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరో వైపు చూస్తే ఈసారి దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల సాధారణ సగటు వర్షపాతం కంటే సుమారు 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావం ఉంటే కనుక వ్యవసాయ రంగానికి తీవ్ర ప్రతికూలత పరిస్థితులు ఉంటాయని వ్యవసయ రంగ నిపుణులు చెబుతున్నారు.
