Begin typing your search above and press return to search.

పవిత్ర పర్వదినాన ప్రళయం.. అల్‌ అక్సా మూసివేత!: అక్కడ ఏం జరిగింది?

లోకమంతా శాంతిని కాంక్షించే పండగ పూట కూడా పశ్చిమాసియాలో నెత్తురు పారుతుండడం అత్యంత విషాదకరం.

By:  Tupaki Political Desk   |   21 March 2026 1:05 PM IST
పవిత్ర పర్వదినాన ప్రళయం.. అల్‌ అక్సా మూసివేత!: అక్కడ ఏం జరిగింది?
X

లోకమంతా శాంతిని కాంక్షించే పండగ పూట కూడా పశ్చిమాసియాలో నెత్తురు పారుతుండడం అత్యంత విషాదకరం. అల్లా ఆశీస్సులు ఉండాల్సిన 'ఈద్‌ ఉల్‌-ఫితర్‌' పర్వదినాన ప్రార్థనల కంటే మిసైళ్ల మోతలే ఎక్కువగా వినిపించడం, పవిత్ర అల్‌ అక్సా మసీదు తలుపులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూతపడడం యుద్ధం భీభత్సాన్ని కళ్లకు కడుతోంది. ఒకవైపు ఇరాన్‌ తన సర్వస్వాన్ని కోల్పోయిందని అమెరికా, ఇజ్రాయెల్‌ గర్జిస్తుంటే.. మరోవైపు తాము ఇంకా క్షిపణులను తయారు చేస్తూనే ఉన్నామని ఇరాన్‌ హెచ్చరించడం చూస్తుంటే, ఈ మంటలు ఆరేలా కనిపించడం లేదు.

పశ్చిమాసియా వ్యాప్తంగా శుక్రవారం ఈద్‌ ఉల్‌-ఫితర్‌ వేడుకలు జరగాల్సిన వేళ, జెరూసలెం నుంచి దుబాయ్‌ వరకు క్షిపణుల మోతలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ జరిపిన దాడితో జెరూసలెం ఓల్డ్‌ సిటీ దద్దరిల్లిపోగా, భద్రతా కారణాల దృష్ట్యా చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును అధికారులు మూసివేశారు. 1967 తర్వాత ఈ పవిత్ర దినాన ప్రార్థనలకు అనుమతించకుండా మసీదును మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పండుగ పూట భక్తి భావం కంటే భయమే రాజ్యమేలుతోంది.

గల్ఫ్ దేశాలపై డ్రోన్ల పంజా

తమ గ్యాస్ క్షేత్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ముప్పేట దాడికి దిగింది. కువైట్‌లోని అతిపెద్ద మినా అల్‌-అహ్మదీ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడడంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అటు దుబాయ్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై కూడా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. తమ దేశంలోని అమెరికా స్థావరాల నుంచి దాడులకు అనుమతిస్తే, ఆయా దేశాలను కూడా యుద్ధంలో భాగస్వాములుగా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించడం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పరాకాష్టకు తీసుకెళ్లింది.

ఇరాన్ అణు కలలను చిదిమేశాం .. నెతన్యాహు

ఇరాన్ పాలకుల అణ్వాయుధ ఆకాంక్షలను, ఆ దేశ మిలిటరీ సామర్థ్యాలను పూర్తిగా నాశనం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్‌ వ్యవస్థలను, పారిశ్రామిక పునాదులను పెకిలించివేశామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇరాన్ గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయని, ఆ దేశం ఇక యురేనియం శుద్ధి చేసే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

నాటో దేశాలు 'పిరికిపందలు'.. ట్రంప్

ఈ యుద్ధంలో తనకు సహకరించని నాటో కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నాటో దేశాలు పిరికిపందలు, వారి వైఖరిని మేము గుర్తుంచుకుంటాం’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. యుద్ధాన్ని సైనికంగా గెలిచినా, హర్మూజ్ జలసంధిని తెరిపించే విషయంలో ఆ దేశాలు చొరవ చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఇప్పుడు నాయకత్వం లేని దేశంగా మారిందని, మాట్లాడదామన్నా అక్కడ ఎవరూ మిగలలేదని ట్రంప్ ఎద్దేవా చేశారు.

యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా తమ శత్రుదేశాల్లోని వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలేవీ సురక్షితం కావని ఇరాన్ జనరల్ అబొల్‌ఫజల్‌ షెకార్చీ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనలో పడేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దాడులకు తెగబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్‌ను తెరిచేందుకు అమెరికా అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించుతుండటం చూస్తుంటే, రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది.