Begin typing your search above and press return to search.

భారత్‌ - కెనడా ఉద్రికత్తలు.. విద్యార్థులపై ప్రభావమెంత?

హరదీప్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో విమర్శానాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కెనడాలో భారత రాయబారిని బహిష్కరించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:45 AM GMT
భారత్‌ - కెనడా ఉద్రికత్తలు.. విద్యార్థులపై ప్రభావమెంత?
X

కెనడా ఖలిస్థానీ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారం భారత్‌ - కెనడా మధ్య ఉద్రికత్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. హరదీప్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో విమర్శానాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కెనడాలో భారత రాయబారిని బహిష్కరించారు. దీంతో కెనడా వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌ తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తను కూడా బహిష్కరించి దీటుగా బదులిచ్చింది.

దీంతో ఇరు దేశాల సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, విద్యపై ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా భారతదేశ విద్యార్థులు తమ విదేశీ విద్యకు ఎంపిక చేసుకుంటున్న దేశాల్లో ఇటీవల కాలంలో కెనడా కూడా అగ్ర భాగాన నిలుస్తోంది. అమెరికాకు పొరుగుదేశం కావడం, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు ఉండటం, కోర్సులు పూర్తి కాగానే ఉద్యోగావకాశాలు, కెనడా పౌరసత్వం కూడా సులువుగానే దక్కుతుండటం, పక్కనే ఉన్న అమెరికాకు వెళ్లడానికి సానుకూల అవకాశాలు తదితర కారణాలతో కెనడాను భారత విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు.

ప్రస్తుతం కెనడాలో 3.19 లక్షల మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. అమెరికా తర్వాత కెనడాలోనే భారత విద్యార్థులు అధికంగా ఉన్నారు. విద్య విషయంలో భారత్‌– కెనడాల మధ్య బలమైన సంబంధాలున్నాయి. ఇరుదేశాల మధ్య దాదాపు 200 విద్యాసంస్థలు పరస్పర ఒప్పందాలను కలిగి ఉన్నాయి. కెనడాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం కావడం గమనార్హం. అక్కడ మొత్తం విదేశీ విద్యార్థుల్లో 20 శాతం మంది భారతీయులేనని చెబుతున్నారు.

ముఖ్యంగా భారతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు మంచి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కెనడా బ్యూరో ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం.. 2021లో కెనడా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థుల ద్వారా మొత్తం 4.9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40 వేల కోట్లు) సమకూరడం గమనార్హం.

ఇక భారత్‌ – కెనడాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా భారత్‌– కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2022–23 నాటికి 8.16 బిలియన్‌ డాలర్లకు చేరింది. కెనడాకు ఫార్మా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్‌ పనిముట్లను భారత్‌ ఎగుమతి చేస్తోంది. వీటి విలువ 4.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కాగా కెనడా నుంచి భారత్‌.. పప్పులు, కలప, కాగితం, మైనింగ్‌ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది.

భారత్‌ లో కెనడా పెట్టుబడులు భారీగానే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఆర్థిక సేవల విభాగాల్లో భారీగా కెనడా పెట్టుబడులు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా 2022 చివరి నాటికి ఆ దేశం 45 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. కెనడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండటం విశేషం

ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు అనేవి వాణిజ్య అంశాలపై ఆధారపడి ఉంటాయని.. అందుకే వాటిపై ప్రస్తుత ఉద్రిక్తతలు ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌– చైనాల మధ్య సంబంధాలు క్షీణస్థాయిలో ఉన్నప్పటికీ.. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెనడా– భారత్‌ తాజా ఉద్రిక్తతల వల్ల వాణిజ్య, విద్య తదితర సంబంధాలపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంటున్నారు.