Begin typing your search above and press return to search.

టీ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కోట్లు పోగేసిందెవ‌రు... నిండా మునిగిందెవ‌రు...

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం నోటిఫికేష‌న్ వ‌చ్చిన నాటి నుంచి 42 రోజులు సాగింది. ఈ 42 రోజుల్లో బాగా ల‌బ్ధి పొందింది.. బాగా న‌ష్ట‌పోయింది.. ఎవ‌రు? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:31 AM GMT
టీ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌:  కోట్లు పోగేసిందెవ‌రు... నిండా మునిగిందెవ‌రు...
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో రాజ‌కీయాలు. పార్టీలు, అభ్య‌ర్థ‌ల గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతూ నే ఉంటుంది. కానీ, వీరిని ప‌క్క‌న పెట్టి.. ఆలోచిస్తే.. ఎన్నిక‌ల ప్ర‌భావం ఏయే రంగాల‌పై ఉంది ? ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? ఎన్నిక‌ల వ్యాపారం ఎలా ఉంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం నోటిఫికేష‌న్ వ‌చ్చిన నాటి నుంచి 42 రోజులు సాగింది. ఈ 42 రోజుల్లో బాగా ల‌బ్ధి పొందింది.. బాగా న‌ష్ట‌పోయింది.. ఎవ‌రు? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో ల‌బ్ధి పొందిన వ‌ర్గాలు.. మీడియా, హోట‌ల్‌, ఆహార రంగం, ప్రింటింగ్ రంగం. వీటిలోనూ భారీగా ల‌బ్ది పొంది.. కోట్ల‌కు కోట్లు పోగేసుకుంది.. మాత్రం స్టార్ హోట‌ళ్లే. అటు ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారు లు వ‌చ్చినా.. ఇటు జాతీయ పార్టీల నుంచి నేత‌లు వ‌చ్చినా.. స్టార్ హోట‌ళ్ల‌లోనే బ‌స చేశారు. అక్క‌డే మీడియా స‌మావేశాలు నిర్వ‌హించారు. దీంతో కోట్ల‌కు కోట్ల బిల్లులు చెల్లించారు. ఇక‌, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మీడియా సంస్థ‌ల‌కు కూడా ఈ ద‌ఫా బాగానే గిట్టుబాటైంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఆహార రంగం పుంజుకుంద‌ని కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. రోడ్డుప‌క్క‌న ఉండే బ‌ళ్ల నుంచి చిన్నా చిత‌కా హోట‌ళ్ల వ‌ర‌కు.. ఈ 40 రోజుల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల రూపాయ‌ల బిజినెస్ చేసిన‌ట్టు లెక్కలు చెబుతున్నాయి. బిర్యానీలు, మీల్స్‌, టీ, కాపీల పంపిణీ పెరిగిన నేప‌థ్యంలో ఈ లెక్క‌లు వేస్తున్నారు. ఇక‌, ప్రింటింగ్ రంగం కొంత స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిందని చెబుతున్నారు. క‌రోనా త‌ర్వాత‌.. ప్రింటింగ్ రంగం ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

అయితే.. తాజా ఎన్నిక‌ల్లో నాయ‌కులు ఫ్లెక్సీలు, క‌ర‌ప‌త్రాల పంపిణీని విరివిగా చేశారు. పైగా అభ్య‌ర్థులు ఎక్కువ మంది పోటీలో ఉండ‌డంతో ఫ్లెక్సీలు, క‌ర‌ప‌త్రాలత‌యారీకి.. రాత్రుళ్లు కూడా.. ప‌నిచేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. సో.. ఇవ‌న్నీ.. లాభంలో ఉన్న రంగాలు అయితే.. న‌ష్ట‌పోయిన వారు రైతులు. ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. నిజ‌మేన‌ని అంటున్నారు. ఎందుకంటే.. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రచారం కోసం.. రైతు కూలీల‌ను నాయ‌కులు తెచ్చుకున్నారు. కొంద‌రికి నెల జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో .. ర‌బీ స‌మ‌యంలో పంట‌ల సాగుకు కూలీలు ద‌క్క‌క రైతులు నానా తిప్పలు ప‌డుతున్న‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి.