Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల విద్యార్హత లెక్కలు ఇలా

మొత్తం 119 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోలిసతే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువ.

By:  Tupaki Desk   |   26 Nov 2023 5:40 AM GMT
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల విద్యార్హత లెక్కలు ఇలా
X

కోట్లాది మందిని పాలించే వ్యక్తి గుణగణాలు ఆధారంగానే పాలన ఉంటుందన్నది నిజం. ఎవరు అవునన్నా.. కాదన్నా పాలకుల్లో చదువుకున్న వారు ఎక్కువగా ఉంటే.. వారి విజన్ మిగిలిన వారికి కాస్త భిన్నంగా ఉంటుంది. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతల మాటేమిటి? వారిలో చదువుకున్న వారెంత? ఆ చదువులు ఏ పాటివి? లాంటి ప్రశ్నలు వస్తాయి. మరి.. ఆ లెక్కల్లోకి వెళితే ఆసక్తికర అంశాలుకనిపిస్తాయి.

మొత్తం 119 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలతో పోలిసతే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువ. 2018 ఎన్నికల్లో మొత్తం 1777 మంది అభ్యర్థులు ఉంటే.. ఈసారి మరో 513 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో పదో తరగతి మాత్రమే విద్యార్హత ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పీజీ చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఉండటం ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో అస్సలు చదువుకోని వారి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్.. డాక్టరేట్ వరకు విద్యార్హత ఉన్న వారిని లెక్కల్లోకి తీసుకుంటే.. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులే ఎక్కువ. వారి సంఖ్య గత ఎన్నికల్లో 362 మంది. ఈసారి పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు 441 మంది బరిలో ఉన్నప్పటికి.. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఏకంగా 477 మంది ఉండటం విశేషం. ఇక్కడే ఇంకో సిత్రమైన లెక్క చెప్పాలి. గత ఎన్నికల్లో అసలు చదువుకోని వారు 16 మంది అభ్యర్థులు ఉంటే.. ఈసారి 26 మంది ఉన్నారు. చదువుకున్నోళ్ల మాదిరే చదువుకోని వారు కూడా గతంతో పోలిస్తే ఈసారే ఎక్కువన్న మాట.

ఐదో తరగతి చదివిన వారు గత ఎన్నికల్లో 94మంది ఉంటే.. ఈసారి 91 మంది ఉన్నారు. ఎనిమిదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల విషయానికి వస్తే 2018లో 71 మంది ఉంటే.. ఈసారి 117 మంది ఉన్నారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు 2018లో 362 మంది ఉంటే.. ఈసారి 441 మంది ఉన్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్న అభ్యర్థులు 2018లో 266 మంది ఉంటే.. ఈసారి 330 మంది ఉన్నారు.

అన్నింటికి మించి.. గ్రాడ్యుయేషన్.. గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్ తో పాటు పీజీ చేసిన అభ్యర్థులు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉండటం విశేషంగా చెప్పాలి. డిగ్రీ చేసిన అభ్యర్థులు 2018లో 306 మంది అయితే.. ఈసారి 392 మంది.. గ్రాడ్యుయేషన్ ప్రొఫెసనల్ 2018లో 204 అయితే ఈసారి 242 మంది ఉన్నారు. పీజీ చేసిన అభ్యర్థుల విషయానికి వస్తే గత ఎన్నికల్లో 301 మంది అయితే ఈసారి ఏకంగా 477 మంది బరిలో ఉన్నారు. ఇక.. డాక్టరేట్ చేసిన అభ్యర్థుల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో 34 మంది ఉంటే.. ఈసారి ఎన్నికల్లో మాత్రం 32 మంది ఉన్నారు.