Begin typing your search above and press return to search.

కేంద్ర విద్యాశాఖలో తప్పు మీద తప్పులు.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక నిర్ణయం!

పరీక్షల్లో లోపాలకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తానని అనడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా అనే చర్చ జోరందుకుంది.

By:  Tupaki Political Desk   |   29 May 2026 4:00 AM IST
కేంద్ర విద్యాశాఖలో తప్పు మీద తప్పులు.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక నిర్ణయం!
X

కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న లోపాలు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నీట్ 2026 ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం సమసిపోకముందే, సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనం తప్పులతడకగా జరిగిందనే వివాదం మొదలైంది. దాదాపు 17 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరుకాగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ లైన్ మూల్యాంకనం విధానం వల్ల లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాలు తారుమారు అయ్యాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దుస్థితికి తనదే బాధ్యత అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

విద్యాశాఖలో లోపాలను అంగీకరిస్తూ స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్షల్లో తప్పులకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల మూల్యాంకనంలో తీవ్రమైన లోపాలు దొర్లడం, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ చేసిన ప్రకటనపై విస్తృత చర్చ జరుగుతోంది.

మంత్రి రాజీనామా చేస్తారా?

పరీక్షల్లో లోపాలకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తానని అనడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా అనే చర్చ జోరందుకుంది. అయితే, ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేసే ఆలోచనలో లేరని విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్షాలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నప్పటికీ, మంత్రిత్వ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దడం, పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడంపైనే ఆయన ప్రస్తుతం దృష్టి పెట్టారని అంటున్నారు. రాజీనామా చేసి తప్పుకోవడం కంటే, వ్యవస్థను సరిదిద్దడమే తమ తక్షణ కర్తవ్యమని మంత్రి భావిస్తున్నారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

టెలిగ్రామ్ లో రీనీట్ పేపర్లు?

మరోవైపు విద్యాశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రీ-నీట్ పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ కొందరు టెలిగ్రామ్ చానల్స్ లో ప్రకటిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు దుండగులు రూ.80 నుంచి లక్ష చెల్లిస్తే రీ-నీట్ ప్రశ్నపత్రాలు ఇస్తామని ప్రచారం చేస్తుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే నీట్ యూజీ- 2026 రద్దుతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రీ-నీట్ పై మోసగాళ్లు ఫోకస్ చేయడంపై ఎన్టీఏ అప్రమత్తమైంది. రీ-నీట్ పేపర్లపై మోసగాళ్లు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది.