Begin typing your search above and press return to search.

గది నిండా కరెన్సీ కట్టల గుట్టలు... తెరపైకి మంత్రి పీఏ పేరు!

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ లోని ఓ ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి

By:  Tupaki Desk   |   6 May 2024 6:51 AM GMT
గది నిండా కరెన్సీ కట్టల గుట్టలు... తెరపైకి మంత్రి పీఏ పేరు!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ ఎక్కడికక్కడ నోట్ల కట్టల గుట్టలు దర్శనమిస్తున్నాయి. దొరికిన చోటెల్లా కోట్ల రూపాయలు నగదు దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న ఝార్ఖండ్‌ లోని ఓ ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఫోటో సైతం వైరల్ గా మారింది. మరోపక్క ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం లేస్తుంది!

అవును... సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ లోని ఓ ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. అయితే... అదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము సుమారు పాతిక కోట్లపైనే ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ కేసులో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్‌ 2023లో అరెస్టయ్యారు. ఈ నేపధ్యంలో.. ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన సుమారు 10కి పైగా ప్రాంతాల్లో ప్రస్తుత సోదాలు జరిగాయని తెలుస్తుంది!

ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌ కు సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఓ ఇంట్లోని గదిలో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. దీంతో... ఈ వ్యవహారంపై భారతీయ జనతాపార్టీ స్పందించింది. ఇందులో భాగంగా... ఝార్ఖండ్‌ లో అవినీతి ముగిసిపోలేదని చెబుతూ.. ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపిస్తూ.. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరింది.

మరోపక్క పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని.. ఫలితంగా సుమారు రూ.100 కోట్ల మేర అవినీతి సొమ్ము కూడబెట్టారని వీరేంద్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో... పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్‌ డ్రైవ్‌ ను అధికారులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు!