Begin typing your search above and press return to search.

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు... రూ.1,21,618 కోట్ల ఆస్తుల జప్తు!

అవును... యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఈడీ జోరు గత పదేళ్లలో విపరీతంగా పెరిగిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 4:07 AM GMT
పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు... రూ.1,21,618 కోట్ల ఆస్తుల జప్తు!
X

దేశంలో గత పదేళ్లలో తన రాజకీయ ప్రత్యర్థుల మీదకు మోడీ.. ఈడీని వదులుతారనే విమర్శ విపక్షాల నుంచి ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఆస్తుల జప్తు కూడా అదే స్థాయిలో ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గత పదేళ్లలో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోరు బాగా పెరిగిందని తెలుస్తుంది. సోదాలు, అరెస్టుల సంఖ్యతో పాటు జప్తు సొమ్ము భారీగా ఉందని అంటున్నారు.

అవును... యూపీఏ హయాంతో పోలిస్తే బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఈడీ జోరు గత పదేళ్లలో విపరీతంగా పెరిగిందని అంటున్నారు. ఈ క్రమలో... గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే... సుమారు 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో... అరెస్టుల సంఖ్య కూడా 24 రెట్లు పెరిగింది. ఈ క్రమంలో జూలై 2005 - మార్చి 2014.. ఏప్రిల్ 2014 - మార్చి 2024 మ్నధ్య లెక్కలను పీటీఐ విశ్లేషించింది.

ఈ గణాంకాల ప్రకారం... మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వంలోని తొమ్మిదేళ్లలో 1,797 కేసులను ఈడీ నమోదు చేస్తే.. గత పదేళ్లలో ఆ సంఖ్య 5,155కు చేరిందని చెబుతున్నారు. అంటే... కేసుల విషయంలో వృద్ధి సుమారు మూడు రెంట్లు అన్నమాట! ఇక సోదాల విషయానికొస్తే... యూపీఏ హయాంలోని తొమ్మిదేళ్లలో 84 సోదాలు జరగగా.. 2014-24 మధ్య దేశవ్యాప్తంగా 7,264 సోదాలను ఈడీ నిర్వహించింది.

ఇక ఆస్తుల జప్తు విషయానికొస్తే... యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగి, 5,086.43 కోట్ల ఆస్తులు జప్తూ చేయగా.. పదేళ్ల మోడీ పాలనలో 755 మందిని ఈడీ అరెస్టు చేసి, రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అంటే అరెస్టులు 26 రెట్లు, జప్తులు 24 రెట్లు పెరిగాయన్నమాట. ఇదే క్రమంలో... యూపీఏ హయాంలో 102 ఛార్జిషీట్లు దాఖలవ్వగా.. బీజేపీ పాలనలో 1281 ఛార్జిషీట్లు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో... ఈ డేటాపై స్పందించిన ఒక ఈడీ అధికారి... మనీ లాండరింగ్‌ నేరాలను కట్టడి చేయడానికి తాము తీసుకున్న చర్యలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు! అయితే... విపక్షాలు మాత్రం.. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయని అన్నారు! కాగా... ఆరోపణలు వచ్చిన అనంతరం బీజేపీలో చేరిన వారు మాత్రం.. పైన చెప్పుకున్న జాబితాలో లేరనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం!