Begin typing your search above and press return to search.

మీ కారుకు ఇన్సూరెన్స్ లేదా? అయితే జరిమానా, జైలే..

జాతీయ రహదారులపై టోల్ చార్జీల వసూలు చేసేందుకు ఈ-డిటెన్షన్ సిస్టం వాడుతుంటారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 10:30 PM GMT
మీ కారుకు ఇన్సూరెన్స్ లేదా? అయితే జరిమానా, జైలే..
X

జాతీయ రహదారులపై టోల్ చార్జీల వసూలు చేసేందుకు ఈ-డిటెన్షన్ సిస్టం వాడుతుంటారు. టోల్ గేటు వద్దకు మీ వాహనం రాగానే ఫాస్టాగ్ ను స్కాన్ చేసి చార్జీలు వసూలు చేస్తుంటారు. ఇంతవరకు ఈ-డిటెన్షన్ సిస్టంను ఇలా టోల్ చార్జీల వసూలుకు మాత్రమే వాడేవారు. అయితే ఇప్పుడు మరిన్ని విషయాల సేకరణకు కూడా ఈ-డిటెన్షన్ సిస్టం వాడాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒడిశాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం వల్ల జాతీయ రహదారిపై ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తారు. రెండు, మూడు సార్లు ఉల్లంఘిస్తే సంబంధిత వాహన యజమానిని జైలుకు పంపుతారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీమా లేని వాహనాల బెడద ఎక్కువ అయిపోవడం. ఇలాంటి వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులను ఆర్థికంగా ఆదుకోవడంపై సమస్యలు ఎదురవుతుండటంతో ఈ సమస్యను అధిగమించడానికి స్పెషల్ ఫోకస్ చేసింది. ఇన్సూరెన్స్ చేయని వాహనాలు అసలు హైవే పైకి రాకుండా అడ్డుకోవాలనే నిర్ణయంతో ఈ-డిటెన్షన్ సిస్టంను ప్రవేశపెట్టింది. ముందుగా ఒడిశాలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఈ సిస్టం ద్వారా బీమా చేయంచని వాహనాలు టోల్ గేటు దాటితే వెంటనే గుర్తిస్తారు.

ఇలా గుర్తించిన వాహనాలకు ముందుగా రూ. 2 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండోసారి కూడా బీమా చేయకుండా రోడ్డెక్కితే రూ.4 వేలు జరిమానా, 3 నెలల జైలు శిక్ష విధించనున్నారు. ఒక్కోసారి రెండు అమలు చేసేలా నిబంధనలు రూపొందించారు. 1988లోని తీసుకువచ్చిన రోడ్డు ప్రమాదాల నివారణ చట్టం సెక్షన్ 146 కింద పబ్లిక్ రోడ్లపై నడిపే వాహనాలు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఈ నిబంధన పాటించని వారికి జరిమానా విధించాలని ఒడిశా ప్రభుత్వంతో కలిసి కేంద్రం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధన అమలులోకి రావడంతో బీమా లేని వాహనాలు టోల్ గేటు దాటాలంటేనే బయపడుతున్నాయి.

ఈ ఆటోమేటిక్ ఈ-డిటెన్షన్ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశాలో అమలు అవుతున్న ఈ-డిటెన్షన్ వల్ల ఎదురయ్యే సమస్యలను గుర్తించి సమర్థంగా ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భావిస్తున్నారు. నిజానికి ఈ-డిటెన్షన్ విధానాన్ని ఒడిశాలోనే తొలిసారిగా ప్రవేశపెట్టలేదు. దీనికి ముందే బిహార్ లో పొల్యుషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించేందుకు వాడారు. ఆ రాష్ట్రంలోని 32 టోల్ గేట్ల ద్వారా ఈ టెక్నాలజీ ఉపయోంచగా, కేవలం రెండు రోజుల్లోనే 5 వేల వాహనాలను గుర్తించి జరిమానాలు వసూలు చేశారు. వంద ఖర్చయ్యే పొల్యుషన్ సర్టిఫికెట్ చేయించుకోని వాహనదారులు రూ.10 వేల జరిమానా చెల్లించాల్సిరావడంతో ఆ రాష్ట్రంలో పొల్యుషన్ చెకింగులు చేయించుకోవడం ఒక క్రమపద్ధతిన జరుగుతోందని బిహార్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తొలుత 32 టోల్ గేట్ల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని ఆ తర్వాత పట్నా, ముజఫరపూర్, భాగలపూర్ వంటి ప్రధాన పట్టణాలకు విస్తరించారు.

ప్రస్తుతం బిహార్, ఒడిశాల్లో అమలు చేస్తున్న ఆటోమెటిక్ ఈ-డిటెన్షన్ విధానాన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇదే సమయంలో జాతీయ రహదారులపై టోల్ గేట్లు ఎత్తివేసి జియో ట్యాగింగ్ ద్వారా టోల్ చార్జీలు వసూలు చేయాలని చూస్తోంది. జాతీయ రహదారిపై వాహనం ప్రయాణించిన దూరం వరకు టోల్ చార్జీలు వసూలు చేయాలనే ఈ ప్రతిపాదనకు త్వరలో అమలులోకి తీసుకురావాలని రవాణా మంత్రి గడ్కారీ భావిస్తున్నారు. జాతీయ రహదారుల భద్రతకు ఎంతగా పాటుపడుతున్నా, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంత్రి గడ్కారీ.. ప్రమాద బాధితులను ఆదుకునేలా ప్రతి వాహనదారు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచిస్తున్నారు.