Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి కేటీఆర్ మీద పోలీసులకు ఈడీ ఫిర్యాదు.. నిజమెంత?

ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఒక కొత్త ప్రచారం సాగింది

By:  Tupaki Desk   |   16 March 2024 4:59 AM GMT
మాజీ మంత్రి కేటీఆర్ మీద పోలీసులకు ఈడీ ఫిర్యాదు.. నిజమెంత?
X

ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే రోజులు పోయి చాలానే కాలమైంది. సోషల్ మీడియా.. వాట్సాప్ ప్రపంచంలో తోక లేకున్నా పులి.. సింహం రెండు వచ్చి చెలరేగిపోయినట్లుగా ప్రచారం ఈ మధ్యన ఎక్కువైంది.చివరకు కీలక అంశాల విషయంలోనూ.. సంచలన పరిణామాల విషయంలోనూ ఎవరికి తోచింది వారు చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. దాన్ని గుడ్డిగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయటం చూస్తే.. క్రాస్ చెక్ అవసరం లేదా? మరీ ఇంత బాధ్యతారాహిత్యమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఒక కొత్త ప్రచారం సాగింది. ఈడీ విచారణ పూర్తై.. ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్న వేళలో.. మాజీ మంత్రులు కం కుటుంబ సభ్యులైన హరీశ్ రావు.. కేటీఆర్ లు ఈడీ అధికారులను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరి కవితను ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించటమే కాదు వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో ఈడీ అధికారులు కేటీఆర్ వాగ్వాదాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేయటం కనిపించింది. ఇదిలా ఉంటే.. కాసేపటికే మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. తమపై వాగ్వాదానికి దిగటం.. తమ విధులకు భంగం వాటిల్లేలావ్యవహరించారంటూకంప్లైంట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అప్పటికే ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం చేయటం లాంటి వీడియోల నేపథ్యంలో.. ఆయనపై ఈడీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారన్న ఫేక్ ప్రచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో మొదలుపెట్టారు.

ఆ వెంటనే మరికొందరు అత్యుత్సాహంతో అదే నిజమన్న రీతిలో వార్తలు వండేశారు. కానీ.. వాస్తవం ఏమంటే.. కేటీఆర్ మీద ఈడీ అధికారులు ఎలాంటి కంప్లైంట్ ను జూబ్లీహిల్స్ పోలీసులకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు.. ఏసీపీలు సైతం కన్ఫర్మ్ చేశాయి. సో.. మాజీ మంత్రి కేటీఆర్ మీద ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారనటంలో ఎలాంటి వాస్తవం లేదు.