Begin typing your search above and press return to search.

ప్రిన్స్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

ఈ విషయంలో జరిగే పొరపాట్లతో కొత్త చిక్కులు ఎదురవుతుంటాయి. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది.

By:  Tupaki Desk   |   22 April 2025 10:21 AM IST
ప్రిన్స్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?
X

ఇప్పుడే కాదు.. కొన్నేళ్లుగా సినీ నటులు.. సెలబ్రిటీలు.. తాము ప్రచారకర్తలుగా వ్యవహరించే బ్రాండ్లు.. సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జరిగే పొరపాట్లతో కొత్త చిక్కులు ఎదురవుతుంటాయి. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. తాజాగా ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. దీనికి కారణం సాయిసూర్య డెవలపర్స్.. సురానా ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ప్రచారకర్తగా వ్యవహరించటమే.

ఈ రెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన తన ఇమేజ్ ను వినియోగించారన్నది అభియోగం. నోటీసుల నేపథ్యంలో ఈడీ ఎదుట ఈ నెల 27న హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సంస్థల నుంచి ఆయన తీసుకున్న పారితోషికం మీద ఈడీ ఆరా తీయనుంది. గత వారం ఈ రెండు సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించటం తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో సాయి సూర్య సంస్థకు సంబంధించి చూస్తే.. ఈ వెంచర్ లో పెట్టుబడి పెట్టిన పలువురు పెద్ద ఎత్తున మోసపోయినట్లుగా ఆరోపిస్తున్నారు.

2021 ఏప్రిల్ సాయిసూర్య డెవలపర్సర్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా భారీ వెంచర్ చేపట్టారు. పలువురితో కలిసి షాద్ నగర్ లో 14 ఎకరాల భూమిలో రూ.3.21 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ వెంచర్ లో పలువురు పెట్టుబడులు పెట్టారు. ఈ సందర్భంగా తాము హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) నుంచి అవసరమైన అనుమతులు పొందినట్లుగా పేర్కొంటూ.. డబ్బులు పెట్టిన కొద్ది రోజుల్లోనే రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు.

చెప్పిన మాటలకు చేతలకు మధ్య తేడా రావటం.. సమయం గడిచే కొద్దీ కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో పెట్టుబడిదారుల్లో అనుమానం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ మాట నమ్మి డబ్బులు చెల్లించిన వారంతా తాము మోసానికి గురైనట్లుగా గుర్తించారు. దీంతో సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. ముప్ఫై మంది తమకు జరిగినఅన్యాయాన్ని పేర్కొంటూ న్యాయం చేయాలని మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

దీంతో.. పోలీసులు వారికి సమన్లు జారీ చేసినా.. ఎలాంటి స్పందన లేదు. దీంతో.. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. ఇలాంటి వేళలోనే ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణల మీద ఈడీ వీరి సంస్థల్లో సోదాల్ని నిర్వహించింది. తాము కంప్లైంట్ చేసి నాలుగేళ్లుగా అయినా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. ఈ సంస్థతో పాటు సురాన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు వ్యవహరించినట్లుగా గుర్తించి.. ఆయనకు నోటీసులు ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు సదరు కంపెనీల నుంచి మహేశ్ బాబు రూ.3.4 కోట్ల మొత్తాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. దర్యాప్తు సంస్థల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.