19,300 కోట్ల ఆస్తులు ED జప్తుతో అంబానీకి కోలుకోలేని దెబ్బ!
ఆర్థిక నేరాలు ఎప్పటికైనా బయటపడతాయని.. చట్టం ముందు ఎవరూ కింగ్ కాదని అనిల్ అంబానీ గ్రూప్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 29 April 2026 12:48 PM ISTఆర్థిక నేరాలు ఎప్పటికైనా బయటపడతాయని.. చట్టం ముందు ఎవరూ కింగ్ కాదని అనిల్ అంబానీ గ్రూప్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేస్తే ప్రజాస్వామ్యంలో శిక్ష తప్పదని తేలిపోయింది. తాజాగా అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన 3,034 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయడంతో ఈ గ్రూప్ చిక్కులు మరింత ముదిరాయి. ఇప్పటివరకు అనీల్ అంబానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.19,344 కోట్లకు చేరడం గమనార్హం.
ఈ మొత్తం వ్యవహారంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్.హెచ్.ఎఫ్.ఎల్).. రిలయన్స్ క్యాపిటల్ (ఆర్.సి.ఎఫ్.ఎల్) సంస్థలకు సంబంధించిన రూ.11,000 కోట్ల బ్యాంక్ రుణాల ఎగవేత ప్రధానాంశంగా ఉంది. నిధులను షెల్ కంపెనీలకు మళ్లించడం.. రుణాలు మంజూరైన రోజునే అవి మొండి బకాయిలు (ఎన్.పి.ఏ)గా మారడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిధుల మళ్లింపులో టాప్ మేనేజ్‌మెంట్ ఆదేశాలే కీలకంగా ఉన్నాయని దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న ఈ మెయిల్ ఆధారిత డిజిటల్ సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా ఈడీ జప్తు చేసిన ఆస్తులలో ముంబైలోని విలాసవంతమైన ఫ్లాట్ .. ఖండాలాలోని ఫామ్‌హౌస్, మహారాష్ట్రలోని హిల్ స్టేషన్.. అహ్మదాబాద్ సనంద్‌లో ఉన్న భూములు ఉన్నాయి. ఇవే కాకుండా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 7.71 కోట్ల షేర్లను కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ ఏ) కింద అధికారులు అటాచ్ చేశారు. వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ వాటాలను కూడా జప్తు చేయడం అనిల్ అంబానీ గ్రూప్ ఎదుర్కొంటున్న వ్యూహాత్మక వైఫల్యానికి అద్దం పడుతోంది.
చట్టపరంగా కూడా అనిల్ అంబానీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్యాంకులు తన ఖాతాలను `ఫ్రాడ్`గా వర్గీకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో బ్యాంకులు తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు సీబీఐ రంగప్రవేశం చేసి ఆర్‌కామ్ సీనియర్ అధికారులను అరెస్టు చేయడం ఈ విచారణను మరింత వేగవంతం చేసింది.
అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా తమ మాజీ అధికారులతో సంబంధం లేదని ప్రకటిస్తున్నా.. మార్కెట్ విశ్వాసం మాత్రం అట్టడుగుకు చేరింది. దర్యాప్తు సంస్థలు నిధుల మూలాలను అన్వేషించడంలో ఎక్కడా రాజీ పడకపోవడంతో అనిల్ అంబానీ పరిస్థితి అత్యంత ధైన్యంగా మారింది. ఈ పరిణామాలు కేవలం ఒక గ్రూప్‌నకు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ మోసాలకు పాల్పడే ఏ శక్తులైనా చట్టం ముందు తలవంచక తప్పదని హెచ్చరికగా నిలుస్తున్నాయి.
