Begin typing your search above and press return to search.

పుట్టిన రోజు నాడే మాజీ సీఎం కొడుకు అరెస్టు.. లిక్కర్ స్కాంలో ఈడీ ఝలక్

శుక్రవారం ఉదయం భిలాయి సమీపంలోని భూపేష్ బఘేల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

By:  Tupaki Desk   |   18 July 2025 3:26 PM IST
పుట్టిన రోజు నాడే మాజీ సీఎం కొడుకు అరెస్టు.. లిక్కర్ స్కాంలో ఈడీ ఝలక్
X

మనీలాండరింగు కేసుల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. చత్తిస్ ఘడ్ లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో తనిఖీలు చేశారు. ఆయన కుమారుడు చైతన్య బఘేల్ అలియాస్ సంతోష్ బఘేల్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, శుక్రవారం చైతన్య బఘేల్ పుట్టినరోజు అని చెబుున్నారు. అయినప్పటికీ ఈడీ ఆయన పట్ల ఎలాంటి దయ చూపకుండా అరెస్టు చేసింది. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, మద్యం కుంభకోణం జరిగిందని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చింది.

శుక్రవారం ఉదయం భిలాయి సమీపంలోని భూపేష్ బఘేల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో కొన్ని కీలక ఆధారాలు లభించిట్లు చెబుతున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా చైతన్య బఘేల్ లిక్కర్ స్కాంలో చక్రం తిప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ కేసు విషయమై ఇప్పటికే పలుమార్లు బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

కీలక ఆధారాలు లభించడం, విచారణలో సంతోష్ బఘేల్ సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయాన్నే బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో సంతోష్ బఘేల్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఊహించినట్లే ఆయనను అరెస్టు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు ఈడీ అధికారులు తన కుమారుడిని అరెస్టు చేయడం పట్ల మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. తన కుమారుడి బర్త్ డే సందర్బంగా ఈడీ అరెస్టు చేసి గిఫ్ట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. నా కుమారుడి పుట్టున రోజున మంచి బహుమతి ఇచ్చారు’’ అంటూ మాజీ సీఎం విమర్శలు గుప్పించారు.