రాహుల్, సోనియాలకు బిగుస్తున్న ‘ఈడీ’ ఉచ్చు
ఈ కేసులో భాగంగా 2023, నవంబరులో ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
By: Tupaki Desk | 21 May 2025 5:00 PM ISTనేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో వారు రూ.142 కోట్లు అక్రమంగా లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. నేరపూరిత ఆర్జనతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, ఆ తర్వాత కూడా వారు అదే పంథాను కొనసాగించారని పేర్కొంది. బుధవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదనను వినిపించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ, ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.
-రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు:
ఈ కేసులో భాగంగా 2023, నవంబరులో ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం ఆ ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో నివసిస్తున్నవారు ఖాళీ చేయాలని, అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని ఈడీ స్పష్టం చేసింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ చేస్తున్నామని తెలిపింది. ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో (దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ) భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించింది.
ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ, అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈ కేసులో ఈడీ ఆరోపణలు కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాయి.
