Begin typing your search above and press return to search.

డ్రాగన్‌ దేశంలో ఆర్థిక మాంద్యం.. అమెరికాకు దగ్గర కాక తప్పదా?

మరోవైపు చైనా ప్రాపర్టీ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆ దేశంలోనే అతిపెద్ద రియల్టీ సంస్థలు దివాళా దిశగా పయనిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:30 PM GMT
డ్రాగన్‌ దేశంలో ఆర్థిక మాంద్యం.. అమెరికాకు దగ్గర కాక తప్పదా?
X

ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతూ ఇప్పటికే చాలా అంశాల్లో ఆ దేశానికి దరిదాపుల్లోకి వచ్చేసింది.. చైనా. ఓవైపు సైనికంగా.. ఇంకోవైపు ఆర్థికంగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడానికి ఆ దేశం ఉరకలేస్తోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆ దేశం ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుందనే వార్తలు కల్లోలానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రష్యా –ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో చాలా దేశాలు మాంద్యం బారినపడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మాంద్యం బారినపడితే దీని ప్రభావం ప్రపంచమంతటా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అందరిలో ఆందోళనకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందని అంటున్నారు. 2021లో కోవిడ్‌ వైరస్‌ ఆ దేశంలోనే వెలుగుచూసింది. 2021తోపాటు 2022 వరకు చైనా కోవిడ్‌ కల్లోలంతో బెంబేలెత్తింది. జీరో కోవిడ్‌ లక్ష్యంగా కఠిన లాక్‌ డౌన్లు విధించింది. దీంతో పరిశ్రమలు నిలిచిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి.

కోవిడ్‌ తెచ్చిన కల్లోలం చాలదన్నట్టు వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ పేరుతో ప్రపంచ దేశాలను రోడ్డు, రైలు మార్గాలతో చైనాకు కలుపుకుని తన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవాలని చైనా ఆశించింది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఈ ప్రాజెక్టుకు చైనా కోట్లాది డాలర్ల వ్యయం చేస్తోంది. ఇందుకు వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.

మరోవైపు చైనా ప్రాపర్టీ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆ దేశంలోనే అతిపెద్ద రియల్టీ సంస్థలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. ఆ దేశంలో 143 కోట్ల మంది ప్రజలు ఉండగా 300 కోట్ల మందికి సరిపోయేలా ఇళ్లు నిర్మించారు. దీంతో ఇప్పుడు ఆ ఇళ్లన్నీ అమ్ముడుపోక ఘోస్ట్‌ సిటీలను తలపిస్తున్నాయని అంటున్నారు. ఇలా కోవిడ్‌ ప్రభావం, వన్‌ బెల్ట్‌ – వన్‌ రోడ్, ప్రాపర్టీ రంగం పడకేయడం వంటి కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని అంటున్నారు. దీంతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని తెలుస్తోంది.

దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం.. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారిలో 21.3 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉంది.

మరోవైపు చైనాలో నిపుణులైన శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తిందని తెలుస్తోంది. చైనా ప్రభుత్వం జనాభాను తగ్గించడానికి సింగిల్‌ చైల్డ్‌ పాలసీ విధానం అనుసరించడంతో ఆ దేశానికి చాలా నష్టం వాటిల్లింది. నిపుణులైన మానవ వనరులు లేక దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పులు కూడా భారీగానే ఉన్నాయని అంటున్నారు.

చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో చైనా విభేదాలను పక్కనపెట్టి అమెరికాకు దగ్గరవుతోందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్‌ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే అమెరికా బెట్టు చేయకుండా చైనాతో చేతులు కలుపుతోందని అంటున్నారు. చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు (డిమాండ్, సఫ్లై చెయిన్‌) ప్రభావితమవుతుందని పేర్కొంటున్నారు. అయితే చైనా, అమెరికాల మధ్య తాజా సన్నిహిత సంబంధాలు సానుకూల ఫలితాలను ఇస్తాయో లేదో వేచిచూడాల్సిందే.