Begin typing your search above and press return to search.

అత్యుత్సాహమే కొంపముంచిందా ?

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే డీజీపీ అంజనీకుమార్ మీద కేంద్ర ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:26 AM GMT
అత్యుత్సాహమే కొంపముంచిందా ?
X

ఒక్కోసారి కొందరుచూపించే అత్యుత్సాహమే కొంపముంచేస్తుంది. తాజాగా తెలంగాణా ఎన్నికల ఫలితాల సందర్భంగా అదే జరిగింది. ఆదివారం ఉదయం మొదలైన ఓట్ల కౌంటింగుతో మధ్యాహ్నానికి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమైపోయింది. దాంతో డీజీపీ అంజనీ కుమార్ ఒక పూలబొకేతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఎన్నికల్లో గెలిచినందుకు అభినందించారు. రేవంత్ ను డీజీపీ కలవటం, పూలబొకేని ఇవ్వటం అంతా మీడియాలో వచ్చేసింది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత అంజనీకుమార్ బయటకు వచ్చేశారు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే డీజీపీ అంజనీకుమార్ మీద కేంద్ర ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది. వెంటనే డీజీపీని సస్పెండ్ చేసింది. అంజనీకుమార్ ప్లేసులో రవిగుప్తాను డీజీపీగా ఎన్నికల కమీషన్ నియమించింది. దాంతో రవిగుప్తా డీజీపీగా బాద్యతలు కూడా తీసేసుకున్నారు. ఒకే ఒక్క ఘటనతో అంజనీకుమాకర్ మాజీ డీజీపీ అయిపోయారు. నిజానికి రేవంత్ ను అంజనీకుమార్ కలవకూడదు. ఎన్నికల నిబంధనల ప్రకారం డీజీపీ ప్రధాన ప్రతిపక్ష నేతను కలవకూడదు. ఎంతో అవసరమైతే తప్ప ముఖ్యమంత్రినే కలవకూడదని నిబంధనలు ఉన్నపుడు ప్రధాన ప్రతిపక్ష నేతను డీజీపీ ఎలా కలుస్తారు ?

ఒకవేళ అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ నేతగా రేవంత్ డీజీపీని రమ్మని కబురుచేసినా వెళ్ళకూడదు. ముందుగా ఆ విషయాన్ని ఎన్నికల కమీషన్ తో చర్చించాలి. కమీషన్ అనుమతి ఇస్తే అప్పుడు వెళ్ళి రేవంత్ ను కలిస్తే డీజీపీ తప్పుండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ అప్పటికి ప్రకటించలేదు. అధికారంలోకి కాంగ్రెస్ రావటం ఖాయమైందన్నది అందరికీ తెలిసిందే.

ఇలాంటి విషయాలు మామూలు జనాలు మాట్లాడుకోవటానికి బాగుంటాయి. కానీ ఉన్నతాధికారులు నడుచుకోవటానికి కొన్ని రూల్సుంటాయి. వాటి ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సుంటుంది. ప్రమాణస్వీకారం, బహిరంగసభ ఏర్పాట్లు తదితరాలను చర్చించటానికే అంజనీకుమార్ ను రేవంత్ పిలుచుండచ్చు. కానీ అధికారికంగా ఫలితాలు ప్రకటించనపుడు ఏమి మాట్లాడినా అనధికారికమే అవుతుంది. అందుకనే అంజనీకుమార్ పై వేటు పడింది. రేవంత్ ను కలవటంతో అంజనీకుమార్ కు ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు ఏమీ లేకపోవచ్చు కానీ కలిసేందుకు చూపించిన అత్యుత్సాహమే కొంపముంచేసింది.