Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లోకి ఈసీ ఎంట్రీ...అలెర్ట్ కావాల్సిందే !

ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ మీద విపక్షాలు మండిపడుతున్నా రచ్చ జరుగుతున్నా కేంద్ర ఎన్నీకల సంఘం తన విశేష అధికారాలతో సర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది.

By:  Satya P   |   20 Feb 2026 11:57 AM IST
తెలుగు రాష్ట్రాల్లోకి ఈసీ ఎంట్రీ...అలెర్ట్ కావాల్సిందే !
X

కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసీ విధులు అన్నీ తెలుసు కదా. ఎన్నికలను స్వేచ్చగా నిష్పాక్షికంగా జరిపించడం, పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం అన్నది ఈసీ ముఖ్య విధులలో భాగం. ఇదిలా ఉంటే ఈసీ మరో కీలకమైన బాధ్యతలను ఇపుడు నెరవేరుస్తోంది. దాని పేరే ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా. సర్ అని షార్ట్ కట్ లో అంటారు. ఇప్పటికి అయితే బీహార్ తో మొదలెట్టి దేశంలో 9 రాష్ట్రాల్లో సర్ ని ఈసీ అమలు చేస్తూ వస్తోంది.

రచ్చగా మారినా :

ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ మీద విపక్షాలు మండిపడుతున్నా రచ్చ జరుగుతున్నా కేంద్ర ఎన్నీకల సంఘం తన విశేష అధికారాలతో సర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. అన్ని పత్రాలు ఉంటే ఎవరి ఓటూ పోదని ఈసీ స్పష్టంగా చెబుతోంది. అలా కాకుండా జాబితాలో తప్పుల తడక ఉంటే ఓటుకు వేటు తప్పదని హెచ్చరిస్తోంది. ఆ విధంగా బీహార్ లో యాభై లక్షలకు పైగా ఓట్లు తీసేశారు. అవన్నీ అనర్హత కలిగిన ఓట్లుగా తేల్చారు. పశ్చిమ బెంగాల్లో సైతం 58 లక్షల దాకా ఓట్లు సర్ ప్రక్రియ ద్వారా తొలగించారు. ఇవన్నీ కూడా సరైన ధృవ పత్రాలు లేని ఓట్లుగా స్పష్టం చేశారు. అయితే అర్హులకు ఓట్లు పోతున్నాయని దేశ అత్యున్నత న్యాయ స్థానం దాకా ఈ ఇష్యూని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకుని వెళ్ళినా ఫలితం అయితే లేకపోయింది. సర్ ప్రక్రియను కొనసాగించాల్సిందే అని అక్కడ స్పష్టం అయింది.

ఏప్రిల్ నుంచి ఆరంభం :

ఇక దేశంలోని 22 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒకేసారి సర్ ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలవుతోందని అంటున్నారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. సర్ ప్రక్రియ ఒక్కసారి మొదలైతే ఓట్ల విషయంలో ఈసీ కఠినంగానే వ్యవహరిస్తుంది. అన్ని నిబంధలను కచ్చితంగా అనుసరిస్తూ అన్ని పత్రాలు ఉంటేనే ఓటు ఉంచుతారు. లేకపోతే ఆ ఓటు తొలగిస్తారు. అందువల్ల చిరునామా సైతం అన్నీ పక్కాగా రుజు పత్రాలను ఇప్పటి నుంచే అంతా ఉంచుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఇంట్లో లేని వారు మరణించిన వారు రెండు ఓట్లు కలిగిన వారు, వేరే చోట ఉంటూ అక్కడా ఇక్కడా ఓటు హక్కు పొందుతున్న వారి పప్పులు అయితే సర్ ప్రక్రియలో ఉడికేది లేదని అంటున్నారు.

ఇంటికి వచ్చి మరీ :

సర్ ప్రక్రియలో ఈసీ తరఫున సిబ్బంది ప్రతీ ఇంటికీ వచ్చి అన్ని పత్రాలను తనిఖీ చేస్తారు. బూత్ లెవెల్ అధికారి పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. అలా బీఎల్వోలు ఇంటికి వచ్చినపుడు ప్రతీ కుటుంబం ఓటర్ల జాబితాకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేవు అని ఆ సమయంలో చెబితే ఓటు గల్లంతు అవుతుంది. అయితే అలా గల్లంతు అయిన ఓట్లను తిరిగి ఆధారాలు సమర్పించి పొందవచ్చు అని ఈసీ చెబుతున్నా అంతవరకూ పరిస్థితి తెచ్చుకోకుండా ఓటర్లు అంతా తమ ఐడీలను ఇప్పటి నుంచే దగ్గర ఉంచుకోవడం మంచి విషయంగా చెబుతున్నారు.

ఏపీలో సజావుగానే :

ఇక ఏపీలో అయితే ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో చేసే సర్ ప్రక్రియ సజావుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షంలో వైసీపీ ఉంది. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ పార్టీయే చేయాలి. కానీ సర్ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ వెల్లడించింది. అయితే రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతోంది. ఆ విధంగా సర్ ప్రక్రియ విషయంలో ఏపీలో పెద్దగా రాజకీయ రచ్చ ఉండకపోవచ్చు. కానీ తెలంగాణాలో చూస్తే అధికారంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. దాంతో అక్కడ సర్ ప్రక్రియలో ఏ ఓటు తీసేసినా రచ్చ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. సర్ తెలుగు నాట ఏ రకమైన ప్రకంపనలు సృష్టిస్తుందో.