Begin typing your search above and press return to search.

ఏమిటీ ఎబోన్ యూరిన్ కప్ ఎగ్జామ్? టీ పోలీసులు ఎందుకు చేస్తారు?

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్.. గంజాయి సేవించే వారిని ఇట్టే గుర్తించేందుకువీలుగా 'ఎబోన్ యూరిన్ కప్' పరీక్షల్ని నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:19 AM GMT
ఏమిటీ ఎబోన్ యూరిన్ కప్ ఎగ్జామ్? టీ పోలీసులు ఎందుకు చేస్తారు?
X

ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మద్యం తాగేసి వాహనాల్ని నడిపే వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు తరచూ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహించే విషయం తెలిసిందే. మద్యం తాగే వారిని గుర్తించి వారిపై చర్యలకు అనుసరించే విధానం మాదిరే.. గంజాయి.. డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు సరికొత్త ఎత్తుగడకు తెర తీస్తున్నారు.

గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో గంజాయి వాడకంతోపాటు డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు డ్రగ్స్.. గంజాయి సేవించే వారిని ఇట్టే గుర్తించేందుకువీలుగా 'ఎబోన్ యూరిన్ కప్' పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ యంత్రంతో తెలంగాణ రాష్ట్ర యంటీ నార్కోటిక్స్ బ్యూరో కిట్ ను సిద్ధం చేసింది. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపింది.

సదరు పరికరంతో డ్రగ్స్ ను వినియోగించే వారిని గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో దీనికి సంబంధించిన తనిఖీలను నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ మాదిరి.. బస్టాండ్లు.. రోడ్ల మీద అనుమానం వచ్చిన వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంతకూ ఈ టెస్టు ఎలా చేస్తారన్న విషయానికి వస్తే.. గంజాయితో సహా మాదక ద్రవ్యాల్ని వినియోగిస్తారన్న సందేహం కలిగితే.. వారికి కిట్ ఇస్తారు.

మూత్ర పరీక్ష ద్వారా ఈ పరికరాన్ని వినియోగిస్తారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగిటివ్ గా.. ఒక గీత కనిపిస్తే పాజిటివ్ గా తేలుస్తారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా గంజాయి.. డ్రగ్స్ వినియోగించే వారు గతంలో మాదిరి తప్పించుకోలేరు. అనుమానం వస్తే అంతే సంగతులు. బీకేర్ ఫుల్. మాదకద్రవ్యాల వినియోగంతో క్షణిక సంతోషం కలగొచ్చు. కానీ.. దాని ఉచ్చులో ఒకసారి చిక్కుకుంటే జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.