Begin typing your search above and press return to search.

హైదరాబాద్ టెక్కీలకపై ఈసీ ఫోకస్... వారిలో ఆ 40శాతమే కీలకం!

చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై విమర్శలు వస్తుంటాయి.

By:  Tupaki Desk   |   1 Nov 2023 5:30 PM GMT
హైదరాబాద్  టెక్కీలకపై ఈసీ ఫోకస్... వారిలో ఆ 40శాతమే కీలకం!
X

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకుల ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఎత్తులు పై ఎత్తులతో కూడిన రాజకీయ విమర్శలతో పాటు ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని అంటున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ల ఓటు కీలకంగా మారిందని అంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల కమిషన్, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలోకి దిగాయని తెలుస్తుంది.

అవును... హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ తో పాటు అనుబంధ రంగ ఉద్యోగులు పొలింగ్ కు దూరంగా ఉంటారనె విమర్శ ఉంది. చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై విమర్శలు వస్తుంటాయి. ఎన్నికల సమయంలో సెలవులు పెట్టి టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారనే అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

వాస్తవానికి ఐటీ కారిడార్ లో సుమారుగా 7 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంటారు. అలా అని ఇక్కడ వారందరికీ ఓటు హక్కు లేదు. వారిలో సుమారు 30 నుండి 40 శాతం మందికి సొంత ఊర్లోనే ఓటు హక్కు ఉందని చెప్తుంటారు. ఇదే సమయలో సుమారు 25శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని అంటారు. వారి సంగతి కాసేపు పక్కనపెడితే... వారిలో హైదరాబాదులో పుట్టి పెరిగిన వారు, అక్కడే స్థిరపడిన వారు సుమారు 40 శాతం ఉంటారని అంచానా.

దీంతో... ఈ 40శాతం ఓట్లు అంటే సుమారు 3 లక్షల మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే... ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా వారిలో 10 శాతం ఓటర్లు కూడా ఓటు వేసేందుకు రావడం లేదనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చదువుకున్నవారు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఇలా ఓటు వేయడానికి గైర్హాజరవ్వడం సరైన ఆలోచన కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలకు ఎలాగైనా ఆ 40శాతం మందిలో వీలైనంత ఎక్కువ మందితో ఓటు వేయించాలనే దిశగా రాజకీయ పార్టీలతోపాటు, ఎన్నికల కమిషన్, పలు స్వచ్ఛంద సంస్థలు కంకణం కట్టుకున్నాయని చెబుతున్నారు. వీరి ఓట్లు సమాజానికి చాలా ముఖ్యం అనే విషయాన్ని వారికి అర్ధమయ్యే బాషలో చెప్పాలని భావిస్తున్నారని సమాచారం!

కాగా... గ్రామాలతో పోలిస్తే నగరంలో పోలిం శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని అంటుంటారు. నగరవాసులు పోలింగ్ వైపు చూడరని, ఎన్నికలంటే వారికి సంబంధం లేని విషయంగా పలువురు భావిస్తుంటారనే అపవాదు బలంగా వినిపిస్తుంది. పైగా ఆ సమయంలో లాంగ్ వీకెండ్ కలిసివస్తే టూర్లకు ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు. అయితే... ఈసారి మాత్రం అలా జరగకూడదని ఫోకస్ పెట్టారు!