సిక్కోలు సెగ: తూర్పు కాపుల కన్నెర్ర..!
శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గం రాజకీయంగా బలమైన శక్తిగా ఉంది.
By: Garuda Media | 8 April 2026 7:00 AM ISTశ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గం రాజకీయంగా బలమైన శక్తిగా ఉంది. వాస్తవానికి ఇక్కడ మూడు సామాజిక వర్గాలు ప్రబల రాజకీయాలు చేస్తున్నాయి. కొప్పుల వెలమ, కాళింగ, తూర్పుకాపులు. వీరిలో కొప్పుల వెలమ, కాళింగ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు.. మంత్రులుగా.. అధికార పార్టీల లో కీలక పదవులు కూడా దక్కించుకున్నారు. కానీ.. బలమైన సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపులకు అన్యాయం జరుగుతోందన్న వాదన కొన్నాళ్లుగా ఉంది.
తాజాగా ఈ సామాజిక వర్గం రోడ్డెక్కింది. తమకు న్యాయం చేస్తారా? లేదా? అంటూ.. అన్ని ప్రధాన పార్టీల ను ప్రశ్నించడం గమనార్హం. గతంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం.. స్పీకర్ పదవిని అనుభవించారు. ప్రస్తుతం వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు కూడా మంత్రులుగా ఉన్నారు. ఇక, ఎటొచ్చీ.. తూర్పుకాపుల సామాజిక వర్గానికి చెందిన నాయకులు బలమైన వర్గంగా ఉన్నా.. వారికి రాజకీయ పదవులు దక్కడం లేదన్న చర్చ ఉంది.
ఈ క్రమంలోనే తూర్పుకాపులు రాజకీయ న్యాయం పేరుతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే.. ఈ సెగ ఒక పార్టీకో.. ఒక వర్గానికో పరిమితం కాలేదు. వైసీపీ, టీడీపీలు సహా.. శ్రీకాకుళంలోబలంగా ఎదుగు తున్న జనసేన కు కూడా వ్యాపించింది. ఈ మూడు పార్టీలు తమకు మెజారిటీ సీట్లు కట్టబెట్టాలన్నది వీరి ప్రధాన డిమాండ్‌గా ఉంది. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతున్నాయని.. తమకు కనీసం గౌరవ నీయ స్థాయిలో సీట్లను కేటాయించాలని కోరుతున్నారు.
యువత ప్రభావం..
ప్రస్తుతం శ్రీకాకుళంలో తూర్పు కాపు సామాజిక వర్గం యువత ఎక్కువగా ఉన్నారు. ఇతర సామాజిక వర్గా ల్లోనూ యువత ఉన్నప్పటికీ.. తూర్పు కాపులవర్గాన్ని వదిలి రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యం లో తూర్పు కాపు వర్గం రాజకీయ రిజర్వేషన్ కోసం పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఈ మేరకు పార్టీలు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. కేవలం ఈ మూడు మాత్రమే కాకుండా..ఎస్సీలు, ఎస్టీలకు కూడా టికెట్లు కేటాయించే పరిస్థితి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారన్నది చూడాలి.
