Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. పులిని పట్టేశారు

ఇదే సమయంలో రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీపంలోని పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందింది.

By:  A.N.Kumar   |   6 Feb 2026 8:26 PM IST
హమ్మయ్య.. పులిని పట్టేశారు
X

తూర్పు గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా హడలెత్తించిన పెద్దపులి కథకు సుఖాంతం లభించింది. పులిని పట్టుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ టైగర్’ విజయవంతమైంది. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం సహకారంతో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పెద్దపులిని సురక్షితంగా బంధించారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం, అటవీశాఖ సిబ్బంది కలిసి గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో పులి అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. ఎప్పుడైనా పులి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో పోలీసులు, అటవీ సిబ్బంది అప్రమత్తంగా గాలింపు కొనసాగించారు.

ఇదే సమయంలో రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీపంలోని పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. గత ఆరు రోజులుగా పులి దాడుల్లో పశువులు మృతిచెందడంతో ప్రజల భద్రత దృష్ట్యా అటవీశాఖ ‘ఆపరేషన్ టైగర్’ను ముమ్మరం చేసింది. అనుభవజ్ఞులైన సిబ్బంది పొలాలు, అటవీ ప్రాంతాలు, పశువులపై దాడులు జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి పులి ఆచూకీని గుర్తించారు.

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం మత్తు ఇంజెక్షన్ ప్రభావంతో పులి స్పృహ కోల్పోయింది. వెంటనే బోనులో సురక్షితంగా బంధించి విశాఖకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి నేతృత్వంలో నిర్వహించారు. పూణే నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం రాజమహేంద్రవరానికి చేరుకుని ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

మొత్తానికి 17 రోజులుగా భయాందోళనకు గురిచేసిన పెద్దపులిని సురక్షితంగా బంధించడంతో స్థానికులు, రైతులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ పూర్తి కావడంపై అటవీశాఖను గ్రామస్తులు అభినందించారు.