చరిత్రలోకి డీప్ గా తొంగి చూస్తే.. ఫ్యూచర్ భూకంపాల లెక్క తేల్చొచ్చట
విపత్తులు విరుచుకుపడే అవకాశాల్ని గుర్తించటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. దానికి అవసరమైన లాజిక్ చాలా ముఖ్యం.
By: Tupaki Desk | 20 July 2025 2:00 PM ISTవిపత్తులు విరుచుకుపడే అవకాశాల్ని గుర్తించటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. దానికి అవసరమైన లాజిక్ చాలా ముఖ్యం. ప్రకృతి ప్రకోపంతో చోటు చేసుకునే విపత్తుల్లో భూకంపాలు ఒకటి. దీని విధ్వంసం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. వీటిని గుర్తించటం ఎలా? భవిష్యత్తులో వచ్చే భూకంపాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవటం.. అలెర్టు చేయటంపై తాజాగా ఐఐటీ కాన్పూరుకు చెందిన ప్రొఫెసర్ ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.
శాస్త్రీయ పద్దతుల్లో కొన్ని అంశాల్ని అధ్యయనం చేయటం ద్వారా.. భూకంప ముప్పును గుర్తించొచ్చన్నది ఆయన వాదన. ఐఐటీ కాన్పూరు ఎర్త్ సైన్స్ విభాగ ప్రొఫెసర్ జావెద్ మాలిక్ ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు. భూకంపాలకు శాస్త్రీయ ఆధారాలు లభించని చోట.. గ్రంథాలు శాసనాల ఆధారంగా చారిత్రిక అంశాల్ని సేకరించటం ద్వారా భవిష్యత్తులో చోటు చేసుకునే భూకంపాల్ని గుర్తించే వీలుందని చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో గత పది రోజుల వ్యవధిలో వరుస భూకంపాలు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా పోయిన దుస్థితి. భూకంపాలను ముందే గుర్తించేందుకు వీలుగా.. దేశంలోని యాక్టివ్ ఫాల్ట్ లైన్ ప్రదేశాల్ని మ్యాపింగ్ చేయాలన్నది సదరు ప్రొఫెసర్ ఆలోచన.
ఇందులో భాగంగా పాత భూకంపాల సమాచారాన్ని విశ్లేషించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ భూకంపాల చరిత్రకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు అందుబాటులో లేవు. నేపాల్ లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ దేశంలో భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటానికి పురాతన డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయి.
దీంతో.. ఈ సమస్యకు పరిష్కారంగా శతాబ్దాల క్రితం భారత్ లో వచ్చిన భూకంపాల గురించిన సమాచారం కోసం అక్బర్ నామా.. బాబర్ నామాతో పాటు సంస్క్రత గ్రంథాలను పరిశీలించటం ద్వారా కీలక సమాచారం వెలుగు చూస్తుందన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో లభించే సమాచారాన్ని.. క్షేత్రస్థాయిలో క్రాస్ చెక్ చేయటం ద్వారా శాస్త్రీయ ఆధారం లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రయత్నం ఫలిస్తే.. భవిష్యత్ భూకంపాల్ని ముందే గుర్తించటంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలకు వీలుంటుందని చెప్పక తప్పదు.
