Begin typing your search above and press return to search.

ఏపీలో ముందస్తు... వైసీపీ టీడీపీ ఎవరికి అడ్వాంటేజ్....?

ముందస్తు ఎన్నికలు అంటే అధికార పార్టీయే దానికి తగిన రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:53 PM GMT
ఏపీలో ముందస్తు... వైసీపీ టీడీపీ ఎవరికి అడ్వాంటేజ్....?
X

ముందస్తు ఎన్నికలు అంటే అధికార పార్టీయే దానికి తగిన రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే విపక్షానికి ఆ చాన్స్ ఉండదు కాబట్టి. తాము ఎపుడైనా ఎన్నికలకు వెళ్లాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పుని కోరే అవకాశం పవర్ లో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. అలా ముందస్తు ఎన్నికలు పెట్టుకుని దేశంలో చాలా రాజకీయ పార్టీలు లబ్ది పొందాయి. మరికొన్ని దెబ్బ తిన్నాయి.

సరిగ్గా అయిదేళ్ల క్రితం తెలంగాణా ఎన్నికల్లో కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండవసారి వరసగా అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ముందస్తు ఎన్నికల మీద నిర్ణయం తీసుకునే అధికారం నూరు శాతం అధికార పార్టీకి ఉంటుంది. కానీ ఇపుడు ఏపీలో వైసీపీకి అటువంటి అవకాశం ఉందా అన్నది ఒక కీలకమైన చర్చగా ముందుకు వస్తోంది.

ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ముందస్తు ఎన్నికలు అంటోంది. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలను బేరీజు వేసుకుని ముందుకు ఎన్నికలను తోస్తోంది. ఏపీలో వైసీపీ విషయం తీసుకుంటే ఇంకా ఎనిమిది నెలలకు పైగా ఎన్నికలు దూరంగా ఉన్నాయి కాబట్టి చేయాల్సిన పనులు ఉంటే నెమ్మదిగా చేసుకుంటూ వస్తోంది. అలాగే కొత్త ఏడాదిలో కూడా కొన్ని కార్యక్రమాలను చేసి మరీ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్లాన్ వేసుకుంది.

కానీ బీజేపీ ఆతృత వల్ల దేశంలో ఎన్నికలు వచ్చిపడుతున్నాయి. లోక్ సభతో పాటు ఏపీ వంటి డజన్ రాష్ట్రాలలో ఎన్నికలు పెట్టి మినీ జమిలి ఎలక్షన్స్ జరిపించేమని బీజేపీ చెప్పుకోవడానికి ఆరాటపడుతోంది అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా జనాలకు ఎన్నికల ఖర్చు నిధులు కాలం కలసి వస్తాయని చెప్పడం ఉద్దేశ్యం. అదే టైం లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే ఓటమి ఎదురవుతుందన్న బెంగను కప్పిపుచ్చుకునేందుకే జమిలి విధానం అని ముందుకు తెచ్చారని కూడా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో బీజేపీకి అర్జంటుగా ఎన్నికలు కావాలి. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తున్న వైసీపీకి ఇది ప్రాణ సంకటంగా మారుతోంది అని అంటున్నారు. వైసీపీ వరకూ తీసుకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ఉంది అని అంటున్నారు. కానీ బీజేపీ జమిలి ఎన్నికలు అంటే వైసీపీ కూడా ఏదో కాడికి ఓకే అనక తప్పని సిట్యువేషన్ అని అంటున్నారు.

మరి ఏపీలో డిసెంబర్ లోనే ఎన్నికలు అంటే అది వైసీపీకి మంచిదా లేక ఇబ్బందా అన్నది మరో చర్చగా ఉంది. ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తే వేడెక్కి ఉంది. విపక్ష టీడీపీ జనంలోనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మూడు జిల్లాలలో వారాహి యాత్ర చేపట్టారు. ఇంకో వైపు పొత్తుల గురించి కూడా వాడిగా వేడిగా చర్చలు సాగుతున్నాయి.

ఈ పరిణామాల క్రమంలో ఎన్నికలు పెడితే విపక్షాలకు ఎంతవరకూ స్కోప్ ఉంటుంది అన్నది కూడా వైసీపీ చర్చిస్తున్న విషయం. ఏపీలో చూస్తే వైసీపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించి ఉంది. అయితే అధికార పార్టీ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేదు. అది కొంత అవరోధంగా ఉంది అని అంటున్నారు. ఇక స్టార్ కాంపెయినర్లు అయితే వైసీపీకి ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. అన్నింటికీ జగనే జనంలోకి రావాలి. దాంతో కొంత ఆలోచించుకోవాల్సి ఉంది.

అదే టైం లో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అది ఎంత శాతం అన్నది కూడా చూడాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలలో కొంత మంది మీద ప్రజలలో వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అది కూడా చూసుకుని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. కొన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం విధానాల పరంగా దూరం అయితే వారిని చేరువ చేసుకోవాల్సి ఉంది.

ఇవన్నీ ముందస్తు అంటే తక్కువ టైం లో సాధ్యపడతాయా అన్నది చూడాల్సి ఉంది. అయితే వైసీపీకి ఊరటను ఇచ్చే పరిణామం ఏంటి అంటే విపక్షంలో ఇంకా గందరగోళం అయోమయం ఉండడం. పొత్తులు అని అంటున్నారు కానీ ఎవరు ఎవరితో అన్నది తేలడంలేదు. బీజేపీతో ఉన్న జనసేన గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు అని టీడీపీకి సంకేతాలు పంపుతోంది. బీజేపీ అయితే టీడీపీతో పొత్తు మీద ఎటూ తేల్చడంలేదు.

ఇక టీడీపీకి పొత్తుల వల్ల లాభం అని అనుకున్నా నష్టం కూడా ఉంటుంది అని మరో విశ్లేషణ ఉంది. టికెట్ రాని వారు ఇబ్బందులు క్రియేట్ చేయవచ్చు. అలాగే పొత్తులు ఉన్నా ఓట్ల బదిలీ సరిగ్గా జరగకపోతే అసలుకే ఎసరు వస్తుంది. చివరి నిముషంలో పొత్తులు అంటే కలవని మనసులే అవుతాయని అంటున్నారు. ఇలా ముందస్తు ఎన్నికల వల్ల విపక్షం ఇబ్బంది పడితే అది వైసీపీకి ప్లస్ అవుతుంది అని భావిస్తోంది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలలో ప్రజలు ఎపుడూ ఇచ్చిన మాదిరిగానే విలక్షణమైన తీర్పునే ఇస్తారు అని అంటున్నారు.