Begin typing your search above and press return to search.

టీడీపీలో ముందస్తు ఆశలు... వైసీపీ రాజకీయ పందెం....?

తెలుగుదేశం పార్టీలో ఇపుడు ముందస్తు ఆశలు కొత్తగా మొలుస్తున్నాయి. ఆ మాటకు వస్తే పాత ఆశలే మరోసారి కొత్తగా చిగురిస్తున్నాయని అనుకోవాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారుట.

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:51 PM GMT
టీడీపీలో ముందస్తు ఆశలు... వైసీపీ రాజకీయ పందెం....?
X

తెలుగుదేశం పార్టీలో ఇపుడు ముందస్తు ఆశలు కొత్తగా మొలుస్తున్నాయి. ఆ మాటకు వస్తే పాత ఆశలే మరోసారి కొత్తగా చిగురిస్తున్నాయని అనుకోవాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారుట. అంటే డిసెంబర్ లో తెలంగాణాతో పాటే ఎన్నికలు అన్న మాట. నిజానికి టీడీపీ ఆశలు అలా ఉన్నాయి కానీ డిసెంబర్ లో ఎన్నికలు అంటే ఇప్పటి నుంచే కేంద్ర ఎన్నికల సంఘం హడావుడి స్టార్ట్ కావాల్సి ఉంటుంది.

దాని కంటే ముందు ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. ముందస్తు ఎన్నికలు అంటే అసెంబ్లీని సెంటెంబర్ లోనే రద్దు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే తెలంగాణాతో పాటు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇక ఈసారి అసెంబ్లీ సెషన్ ఈ నెల 27 దాకా సాగనుంది. చివరి రోజు జగన్ మాట్లాడుతారు అంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అని అంటున్నారు.

దాంతో పాటు అసెంబ్లీ రద్దు ప్రకటన కూడా ఉంటుందని ఒక పుకారు అయితే ప్రచారంలో ఉంది. బహుశా దాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీలో ఈ చర్చ నడుస్తోందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్ ఎన్నికలు కేంద్రం ఎపుడు అంటే అపుడే అని చెప్పేశారు. కేంద్రం ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా చేయలేదు. కేంద్ర మంత్రులు కొందరు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటున్నారు.

దాంతో బీజేపీ పెద్దలలో ఆ ఆలోచనలు అన్నవి లేవు అని అంటున్నారు. ఉంటే గింటే బీజేపీ కూడా సెప్టెంబర్ లోనే పార్లమెంట్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ అలాంటివి లేకపోతే ఏపీలో కూడా ఉండవనే అంటున్నారు. అయితే వైసీపీ ఆలోచనలు కూడా అంతుబట్టకుండా ఉంటాయి కాబట్టే టీడీపీ ఆ దిశగా ముందస్తు ఆశలు పెట్టుకుంది అంటున్నారు.

టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఢిల్లీలో ఒక జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కనుక వస్తే మూడు నెలలలో వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు అవుతుందని, లేక షెడ్యూల్ ప్రకారం వస్తే ఆరు నెలలలో వైసీపీ ఓటమి ఉందని జోస్యం చెప్పారు.

నిజంగా లోకేష్ అలా ఎందుకు చెప్పారు అన్న చర్చ మొదలైంది. లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు ఏమైనా హింట్ వచ్చిందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ముందస్తు ఎన్నికలు అంటే టీడీపీ ఆశలు ఏమిటి చంద్రబాబు జైలులో ఉన్నారు. సింపతీ అన్నది ఉందని గట్టిగా ఆ పార్టీ నమ్ముతోంది.

దాన్ని సొమ్ము చేసుకోవాలంటే ఎన్నికలు తొందరగా వస్తే బాగుంటుంది అన్నదే ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మేలో జరిగితే అప్పటికి బాబు అరెస్ట్ సెంటిమెంట్ కరిగిపోవచ్చు అని కూడా ఆలోచిస్తోంది. అయితే వైసీపీ ముందస్తుకు వెళ్ళేందుకు కూడా బాబు అరెస్ట్ ఒక కారణం కావచ్చు అన్న వారూ ఉన్నారు.

బాబు జైలులో ఉంటే కనుక టీడీపీ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఫైట్ ఇవ్వలేదు. దాంతో ఆ గందరగోళాన్ని ఆసరగా చేసుకుని వైసీపీ మరింత దూకుడు చేసేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందస్తుకు వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తోందా అన్న చర ఉంది. సీఎం ఎమ్మెల్యేలతో రివ్యూ మంగళవారం చేస్తున్నారు. బహుశా అందులో ముందస్తుకు సంబంధించి ఏమైనా హిట్ దొరుకుతుందేమో చూడాలని అంటున్నారు.