నెల రోజుల ముందుగానే రుతుపవణాలు.. ఐఎండీ చల్లటి కబురు..
ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చేసిన ఈ హెచ్చరిక ముందస్తు ‘చల్లటి కబురు’ అనే చెప్పాలి.
By: Tupaki Desk | 2 May 2026 1:26 PM ISTఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చేసిన ఈ హెచ్చరిక ముందస్తు ‘చల్లటి కబురు’ అనే చెప్పాలి. 45 డిగ్రీల ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ, వర్షాకాలం ముందే రాబోతుండడం వ్యవసాయ రంగానికి, సామాన్యులకు పెద్ద ఊరట. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే భారత్ లోకి రానున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత భారీగా ఉంది. ఈ నేపథ్యంలో మరో కొన్ని రోజుల్లోనే వాతావరణం చల్లబడనుంది. 2009 తర్వాత మళ్లీ అంతటి ముందస్తు వర్షాకాలాన్ని చూడబోతున్నాం.
రుతుపవనాల ప్రయాణం
సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు, ఈసారి వారం రోజుల ముందే రానున్నాయి. మే 14 నుంచి 16వ తేదీ మధ్యలోనే రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది. అండమాన్ నుంచి వేగంగా కదులుతూ మే 25వ తేదీ నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో 2009లో మే 23వ తేదీనే రుతుపవనాలు కేరళకు తాకాయి. మళ్లీ 17 ఏళ్ల తర్వాత అటువంటి ముందస్తు వర్షాకాలం ఈ ఏడాది రాబోతోంది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి
రుతుపవనాలు కేరళకు వచ్చిన వారంలోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. మే 25న కేరళను తాకితే, జూన్ 1 లేదంటే 2వ తేదీ నాటికే రాయలసీమ, దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపవనాలు రాకముందే, ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
వర్షపాతం అంచనాలు
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ పేర్కొంది.
రుతుపవనాలు ముందే రావడం వల్ల ఖరీఫ్ సాగు త్వరగా మొదలవుతుంది. జూన్ లోనే విత్తనాలు నాటేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే, వర్షాలు మొదలయ్యే వరకు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి మే ఆఖరు నాటికి వాతావరణం చల్లబడి, వాన పలకరించనుంది.
