Begin typing your search above and press return to search.

జన గణన : 2027 ఎన్నికలకు కౌంట్ డౌన్ ?

దేశంలో ఎన్నికలకు గట్టిగా రెండున్నరేళ్లు మాత్రమే గడువు ఉందా. ఎన్నికలు 2027 నవంబర్ లేదా డిసెంబర్ లో జరుగుతాయా.

By:  Tupaki Desk   |   17 Jun 2025 8:00 AM IST
జన గణన : 2027 ఎన్నికలకు కౌంట్ డౌన్ ?
X

దేశంలో ఎన్నికలకు గట్టిగా రెండున్నరేళ్లు మాత్రమే గడువు ఉందా. ఎన్నికలు 2027 నవంబర్ లేదా డిసెంబర్ లో జరుగుతాయా. సాధారణ ఎన్నికలకు ఏణ్ణర్థం ముందే ప్రస్తుత పార్లమెంట్ రద్దు అయి ఎన్నికలకు సిద్ధపడతారా ఇత్యాది ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి. దాదాపుగా పదహారేళ్ళ తరువాత దేశంలో జన గణన స్టార్ట్ అయింది. దానిని సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం రిలీజ్ చేశారు.

దేశంలో చివరి సారిగా 2011లో జన గణన జరిగింది. విధానం ప్రకారం అయితే 2021లో జరగాలి. కానీ కరోనా మంచి పీక్స్ లో ఉండడంతో దానిని వాయిదా వేశారు. అయితే 2022 నాటికి కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ జన గణనకు మాత్రం ముహూర్తం ఇపుడే కుదిరింది.

ఇక 2027 మార్చి 1 నాటికి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ జనాభా లెక్కలతో పాటే కుల గణనను కూడా నిర్వహిస్తారు. ఆ విధంగా చూస్తే దేశంలో బీసీలు ఎంతమంది బడుగులు బలహీనులు అణగారిన వర్గాలు ఎంతమంది అన్న డేటా కూడా పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది.

దానిని బట్టి దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు రిజర్వేషన్లు అన్నీ మారుతాయని అంటున్నారు. మరో వైపు చూస్తే 2024 ఎన్నికల ముందే మహిళా బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. దాంతో వచ్చే ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆనాడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు.

దాని ప్రకారం చూస్తే షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు జరిగినా లేక 2027 చివరిలో జరిగినా కూడా ఈసారి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు నిర్వహిస్తారని అంటున్నారు. ఇక జనాభా కచ్చితంగా మరో ఇరవై నుంచి ముప్పయి కోట్ల దాకా ఈ పదహారేళ్ళ కాలంలో పెరుగుతుందని అంటున్నారు

ఇలా పెరిగిన జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపడతారు. అదే జరిగితే కనుక ఉత్తరాదిన అత్యధిక సీట్లు పెరుగుతాయి. ముఖ్యంగా యూపీ బీహార్ వంటి చోట్ల అత్యధికంగా ఎంపీ సీట్లు ఉంటాయని అంటున్నారు. దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్లు చేస్తే ఈ లోక్ సభలో వారి సంఖ్య మూడవ వంతుకు పెరుగుతుంది.

ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయంగా లాభించేవే అని అంటున్నారు. ఆ విధంగా జన గణన కుల గణన మహిళా రిజర్వేషన్లు అన్నీ చూసుకుని ఎంపీ సీట్లు పెంపు చేసి 2027 చివరిలో కానీ 2028 ప్రథమార్ధంలో కానీ ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని ప్రచారం సాగుతోంది.

అందుకే ఒక పద్ధతి ప్రకారమే జన గణన, కుల గణనకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2029 లో జరిగే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. బీజేపీ వ్యూహాలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది అని అంటున్నారు.

దాంతో దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు గట్టిగా చూస్తే మూడేళ్ళ కంటే తక్కువ సమయమే ఉంది అని అంతా భావిస్తున్నారు. నాలుగవ సారి వరసగా అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు లో భాగమే ఇదంతా అని అంటున్నారు. బీజేపీ తన చేతిలో ఉన్న అధికారాన్ని అవకాశాలను వాడుకుంటూ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో గెలవడమే కాదు పూర్తి మెజారిటీని అత్యధిక సీట్లను సాధించాలని బీజేపీ చూస్తోంది.

ఉత్తరాదిన ఎంపీ సీట్లు పెరిగితే కచ్చితంగా బీజేపీకే మేలు అన అంచనా కూడా ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా కూడా బీజేపీ మార్క్ పాలిటిక్స్ చూపిస్తుందని చెబుతున్నారు. మరి దీనికి తట్టుకునేలా ప్రత్యర్ధి శిబిరం వ్యూహాలు ఉన్నాయా అన్నదే ఇపుడు కీలకమైన మౌలికమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఆ దిశగా తాము కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం అనివార్యత అయితే ఇండియా కూటమికి ఉన్నాయని అంటున్నారు.